BIKKI NEWS (MARCH 07) : తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సీ కంటే ముందు టెట్ పరీక్ష నిర్వహించాలని డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన నిరుద్యోగులు (Demanding for TS TET) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
టెట్ నిర్వహించకుండానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అర్హత ఉండి టెట్ లేని కారణంగా టీచర్ ఉద్యోగ పరీక్షకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
గతంలో నిర్వహించిన టెట్‌కు వివిధ కారణాల వల్ల అనేకమంది గైర్హాజరయ్యారు. 2 లక్షల మంది దాకా అర్హత సాధించలేదు. వారితో పాటు కొత్తగా ఉత్తీర్ణులైనవారితో కలిపి సుమారు 4 లక్షల మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2016లో ఒకసారి టెట్ జరిగింది. ఆ తర్వాత 2017లో టెట్ నిర్వహించి, టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఐదేండ్ల తర్వాత 2022 జూన్‌లో టెట్ పరీక్ష నిర్వహించారు. 2023 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 2,23,582 మంది హాజరయ్యారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్-2కు 1,90,047 అభ్యర్థులు హాజరవగా.. 29,073 (15.30 శాతం) మంది అర్హత సాధించారు.