- అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ వ్యాసకర్త అస్నాల శ్రీనివాస్ ప్రత్యేక వ్యాసం
- Gandhi ji jayanthi special easy by asnala srinivas
BIKKI NEWS (OCT 02) : ఏ విషయాన్నైనా కూలంకషంగా ఆలోచించి, నిర్థారించేందుకు పట్టుదలగా సాగే కృషిని చేసే వారిని, సమాజ స్వభావాన్ని, సమాజ అస్థిత్వాన్ని నిర్థారించే సూత్రాలను, సామాజిక జీవనాన్ని కార్యాచరణను విశ్లేషిస్తూ సమాజాన్ని పురోగమింపచేసే వారిని తాత్వికులు అంటారు. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ తన కాలపు సామాజిక, రాజకీయ పరిణామాలను గ్రంథస్తం చేస్తూ ఆచరణలో ఉన్న వారిని నిర్మాత అంటారు. ఈ ప్రామాణిక ప్రాతిపదికల వెలుగులో ఆధునిక భారతదేశ రాజకీయ, సాంఘీక విప్లవాలకు నాయకత్వం వహించి, ఈ వెల్లువను ఆసియా, ఆఫ్రికా, ఆమెరికా, యూరఫ్ ఖండాలకు చెందిన 12 దేశాలలో వలసవాద, వర్ణ వివక్ష విమోచన ఉద్యమాలకు దీప స్థంభంగా, దిక్సూచి గా నిలిచిన భారత ప్రియపుత్రుడు మెహన్‌దాస్ కరంచంద్ గాంధీ. మానవ జీవనానికి, పుట్టుకకు, మరణానికి సార్థకతను తన పారదర్శక సత్యవంత ,అర్థవంత జీవితంతో సార్థకతను చేకూర్చిన ఆధునిక నవ్య మానవుడిగా, చారిత్రికుడిగా చరిత్రలో చెరగని ముద్రవేసిన వారు గాంధీ. వలసవాద విముక్తి, వర్ణ వివక్ష, కులవివక్ష వ్యతిరేఖ ఉద్యమాలలో రైతు హక్కుల పరిరక్షణ, గ్రామీణ స్వరాజ్యం, స్త్రీ జనోద్దరణ, శ్రమతో ముడిపడిన విద్య, స్వయంపోషక ఆర్థిక వ్యవస్థ, మతసామరస్యత కోసము ఇలా అనేక బహుళ కార్యరంగాలలో తన అహింసా శక్తితో, శాంతియుత ప్రతిఘటనతో, సృజనాత్మకతతో స్తబ్ధత ,జడత్యం ఉదాసీనత ఆవరించిన భారతదేశ చరిత్రను గొప్ప ముందడుగు వేయించిన వారు మహత్మ గాంధీ.
ఆసియా, ఆఫ్రికా, ఆమెరికా, యూరఫ్ ఖండాలకు చెందిన 12 దేశాలలో వలసవాద, వర్ణ వివక్ష విమోచన ఉద్యమాలకు దీప స్థంభంగా, దిక్సూచి గా నిలిచిన భారత ప్రియపుత్రుడు మెహన్‌దాస్ కరంచంద్ గాంధీ. – అస్నాల శ్రీనివాస్
నా ప్రజల కోరికలను గౌరవించని ప్రభుత్వానికి సేవ చేయడానికి తిరస్కరిస్తున్నాను, మమ్మలని ఉద్దరింపడానికి బదులు పతనం చేయడానికి ఉపయోగపడుతున్న మీ చట్టాలను సమర్థించను, మేము చెల్లిస్తున్న పన్నులను మా సంక్షేమ కోసం కాకుండా మమ్ములని బలహీనపర్చడానికి మేము వ్యతిరేఖిస్తున్నాము, నా ప్రజల ఆకాంక్షలను గౌరవించని ప్రభుత్వం నుండి విముక్తి కోసము పోరాడుతానని ప్రకటించి ఆంగ్లేయుల వలసపాలన విముక్తి కోసము మూడు మహా ఉద్యమాలను నడిపించాడు. ప్రజల సంసిద్ధత ,అన్ని వర్గాల, మతాల ప్రజల భాగస్వామ్యం ప్రాతిపదికగా 1920 సహాయనిరాకరణోద్యమం, 1930 శాసనధిక్కార ఉద్యమం, 1940 క్విట్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. వీలైనంత మేరకు ప్రాణత్యాగాలు నిరోధిస్తూ, తగ్గిస్తూ, శాంతియుత పౌరప్రతిఘటన స్వాతంత్య్ర సమరాన్ని నడిపాడు. ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే ఎంతటి శక్తినైనా ఎదుర్కొనే ధైర్య సాహసాలని ప్రతి జాతి ప్రదర్శిస్తుంది. ప్రస్తుత భారతజాతి ఆత్మగౌరవం సంపూర్ణ సమానత్వం సాధన దిశగా పురోగమిస్తుంది. ఆత్మ పరిత్యాగాలకు నెలవైౖన హైందవ యజ్ఞం, ఇస్లాం కుర్బానీలతో పునీతమైన ఈ భారతావనీ పై ఐక్యతతో పోరాడి న్యాయ ప్రాతిపదికన స్వరాజ్యాన్ని నిర్మిస్తుందని ప్రకటించాడు. అన్ని మతాలు అహింస ను ప్రభోదిస్తున్నాయని ,కాని ప్రస్తుతం మతాల పేరుతో అటవిక న్యాయం అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇది అప్రజాస్వామికం అని అప్పటి సంఘ్ చాలక్ గోల్వాల్కర్ అతని అనుయాయులను మందలించారు .స్వాతంత్ర్య సమరం ,మత సామరస్యంలను శ్వాసగా ధ్యాసగా పనిచేసిన అపురూప ఇతిహాస మానవుడు గాంధీజీ.
వీలైనంత మేరకు ప్రాణత్యాగాలు నిరోధిస్తూ, తగ్గిస్తూ, శాంతియుత పౌరప్రతిఘటన స్వాతంత్య్ర సమరాన్ని నడిపాడు గాంధీ – అస్నాల శ్రీనివాస్
స్వరాజ్య సమరంలో విశాల ప్రజానీకాన్ని కదిలించే ప్రయత్నాలు చేస్తూనే భారతీయ సామాజిక వ్యవస్థలో వ్యవస్థీకృతమైన రుగ్మతలను తొలగించే ప్రయత్నం చేసాడు. మానవత్వానికి మాయని మచ్చగా, సమాజ వటవృక్షాన్ని చెదలుగా తినేస్తున్న అస్పృశ్యతను హిందూ ఆధిపత్య కులాలు ఆచరించినంత కాలం స్వరాజ్యం సాధించడం సాధ్యపడదు అని హెచ్చరించాడు. మనలను రంగు, జాతి పేరుతో ఆపరాధంగా భావించి దక్షణాఫ్రికాలో శిక్షిస్తారు. దీని పై మనం అన్యాయమని నిరసనలు తెలియచేస్తున్నాము. కాని మనం సహమతస్థులైన పంచములను ఆలయ ప్రవేశాన్ని, బావులను, బడులను ఉపయోగించుకోవటాన్ని తిరస్కరించడం అత్యంత హీనమైన మృగలక్షణం అని చెప్పాడు. హరిజన్ పత్రిక ద్వారా సామాజిక మత దురాగతాలను ఎండగట్టే ప్రచారాన్ని నిర్వహిస్తూ, హరిజన సేవక సంఘం ద్వారా ఆధిపత్య వర్ణాలు పశ్చాత్తాపం చెంది, నష్టపరిహారం చెల్లించే విధంగా కార్యక్రమాలను నిర్వహించాడు. గాంధీజీ చేస్తున్న ఈ సాంఘీక సంస్కరణలు మితవాద దోరణితో ఉన్నాయని , తాత్విక మూలాలను తొలగించే కృషి చేయడంలేదని అంబేద్కర్ నుండి విమర్శలను ఎదుర్కొన్నాడు. అలాగే వర్ణవ్యవస్థ యధాతధంగా కొనసాగాలని భావించే ఆర్.ఎస్.ఎస్. హిందూ మహాసభ వంటి చాంధస మతోన్మాద సంస్థల నుండి కూడా గాంధీ తీవ్రమైన విమర్శలను నిరసనలను ఎదుర్కొన్నాడు.
పని, శ్రమ, అన్వేషణ ద్వారానే జ్ఞానం ఉత్పత్తి అవుతుందని, కావున శ్రమతో ముడిపడిన జ్ఞానాన్ని, శ్రమ గౌరవ పాఠాలను విద్యాలయాల్లో బోధించాలని పేర్కొన్నాడు. దీనిని నైతాలీం అనగా ‘నూతన శిక్షణ’ పేరుతో విద్యా ప్రణాళికను రూపొందించాడు. – అస్నాల శ్రీనివాస్
ఆర్థిక విప్లవ కార్యాచరణలో భాగంగా గ్రామీణాభివృద్ధి, రైతాంగ సమస్యల పరిష్కారం, ప్రజల తక్షణ బాగోగుల కోసము గాంధీజి పనిచేసారు. 1917 బీహార్‌లోని చంపారన్ ప్రాంతంలో ఐరోపా నీలిమందు తోట యజమానులు రైతు కూలీల పై జరిపే దౌర్జన్యాలకు వ్యతిరేఖంగా ఆచార్య కృపాలానీతో కలిసి ఉద్యమం నిర్వహించాడు. ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం చంపారన్ కౌలుదారి చట్టంను తీసుకవచ్చి ఓ మేరకు అమలు చేసింది. ఫలితంగా కౌలుదార్ల పై దౌర్జన్యాలు ఆగిపోవడం ,షరతులు లేకుండా నీలిమందు పంటను పండించే అవకాశం, గిట్టుబాటు ధరను ఇవ్వడం వంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ విజయం స్వాతంత్ర్య సమరాన్ని మరింత తీవ్రతరం చేయడానికి దోహదపడిందని తరచూ బాపుజీ చెప్పేవారు .గ్రామంలో భూమి ఉమ్మడి ఆస్తిగా ఉండాలని, అందులో అందరూ తమ శక్తి మేరకు శ్రమించి సంపదను పెంచాలని, అవసరాల మేరకు పంచుకోవాలని భావించాడు. పని, శ్రమ, అన్వేషణ ద్వారానే జ్ఞానం ఉత్పత్తి అవుతుందని, కావున శ్రమతో ముడిపడిన జ్ఞానాన్ని, శ్రమ గౌరవ పాఠాలను విద్యాలయాల్లో బోధించాలని పేర్కొన్నాడు. దీనిని నైతాలీం అనగా ‘నూతన శిక్షణ’ పేరుతో విద్యా ప్రణాళికను రూపొందించాడు. బ్రిటీష్ సామ్రాజ్యవాదం, పారిశ్రామిక విప్లవంతో తీవ్రంగా నష్టపోయిన చేనేత పరిశ్రమను చూసి చలించిపోయాడు. భారీపరిశ్రమలు, మానవ వనరులను పరిమితంగా ఉపయోగించడం వలన నిరుద్యోగం పెరుగుతుందని చెప్పాడు. ఈ నేపధ్యంలో చరఖాతో ఖాదీని వడకడం చేతి వృత్తుల పరిరక్షణ ఉద్యమానికి ,స్వరాజ్య సమరానికి ఒక ప్రతీకగా నిలిపాడు. కేంద్ర ,ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రతి గ్రామంలొ నూలు వడకడం ,నేయడం ను ప్రోత్సహించే విధంగా విధానాలను రూపోందించాలి సూచించాడు . చిన్న తరహా కాటేజీ పరిశ్రమలు ప్రజల జీవనోపాధిని విస్తృతం చేస్తాయి.ఆర్ధిక విధానాలు పారిశ్రామికులకు కాకుండా సామాన్య ప్రజానీకానికి మేలును చేకూర్చే విధంగా ఉండాలని ,గుత్తాధిపత్యం ఉండరాదని సూచించాడు . తద్వారా సమ్మిళిత, సంతుళిత అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. కాని మనిషి దురాశ, పేరాశలతో ప్రకృతి వనరులు అనుహ్యమైన వేగంతో విధ్యంసం చెందుతున్నాయని ఆవేదన చెంది అనాడే పర్యావరణ ,జీవ వైవిధ్య పరిరక్షణ స్పృహ ను కలిగిఉన్నాడు .
బుద్దుడు, అశోకుడు, గాంధీ, అంబేద్కర్ వంటి దారి దీపాలను ప్రపంచానికి అందించిన భారతదేశంలో వీరు ఎంతో శ్రమకోర్చి నిర్మించిన బహుళత్వ సహజీవన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధ్వంసకర, విద్వేష శక్తులు ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయి. – అస్నాల శ్రీనివాస్
ఇలా గాంధీజీ మానవ విమోచనం, మానవాభివృద్ధి వంటి బహుళ కార్యరంగాలలో జీవిత పర్యంతం అసాధారణ కృషి చేశాడు. సాధించిన స్వరాజ్యం కలకాలం వర్థిల్లడానికి, ప్రతి మనిషి నవ్య మానవుడిగా మారడానికి ఆదర్శనియమాలను పాటించాలని కాంక్షించాడు. అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అస్తేయం, పరిత్యాగం, భౌతిక శ్రమ, అర్థవంత సంభాషణం, నిర్భయం, సర్వమత సమభావన, స్థానిక వనరుల వాడకం, వివక్షతలను అంతం చేయడం వంటి నియమాలను గాంధీజీ ఆచరించి మనకు ప్రవచించాడు. గాంధీజీ జన్మించి 150 సంవత్సరాల తర్వాత గాంధీ ఆశయాలకు దృక్పథానికి మరింత ప్రాసంగికతను సంతరించుకున్నది. నాగరికత వికాసానికి దోహదం చేస్తున్న శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలలో అనేకం నాగరికత విధ్వంసానికి అపశృతులుగా మారుతున్న సందర్భంలో ఉన్నాము. వస్తు వినియోగ వ్యామోహం, డ్రోన్ లతో బాంబులు వేయడాలు, జీవ ఆయుధాలు, రిమోట్ యుద్దాలు, మతఘర్షణలు ,ప్రపంచీకరణ వంటి పెను ప్రమాదాలు ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న సందర్భంలో శాంతియుత సహాజీవనం సాకారానికి, నైతికత, నీతి, శాంతిలతో కూడిన సమాజ నిర్మాణానికి గాంధీయిజమును అనుసరించడమే తక్షణ మార్గంగా సమకాలీన ప్రపంచం ఎంపిక చేసుకోవాలి. బుద్దుడు, అశోకుడు, గాంధీ, అంబేద్కర్ వంటి దారి దీపాలను ప్రపంచానికి అందించిన భారతదేశంలో వీరు ఎంతో శ్రమకోర్చి నిర్మించిన బహుళత్వ సహజీవన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధ్వంసకర, విద్వేష శక్తులు ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయి. గాంధీ హంతకులను వీరులుగా ఆరాధించే ఆరాచక శక్తుల ప్రాబల్యం పెరిగిపోతున్నది. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వరాజ్య, సంఘ సంస్కరణ, మానవ జీవన ప్రమాణాల పెంపు ఉద్యమాలతో సంబంధం లేని సంస్థ నేత ను ఇటీవల అగ్ర రాజ్య యుద్ధ పిపాసి తో ”జాతిపిత”గా పిలిపించుకుంటున్న దౌర్భాగ్యం నెలకొని ఉన్నది. భారతచరిత్రలో కొన్ని చీకటి అధ్యాయాలైన ,మను ధర్మం ప్రాతిపదికగా పాలించిన గుప్తుల ,శుంగుల ,పీష్వాల పాలన నమూనాను పునరుద్ధరించడానికి శర వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి .మత ప్రాతిపదిక, అంధకార ,అటవిక మూఢ యుగంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న సంఘ పరివార్ శక్తులను నిలువరించాలంటే గాంధీజీ అందించిన సిద్దాంతం ఆచరణ దివిటిని దావానంలా వ్యాపింపచేయడమే మన తక్షణ కర్తవ్యం.అదే మాహాత్మునికి మనమిచ్చే నిజమైన నివాళి .
వ్యాసకర్త :
అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం