Home > NATIONAL > WOMEN’S RESERVATION BILL 2023 : బిల్లులోని ముఖ్యాంశాలు

WOMEN’S RESERVATION BILL 2023 : బిల్లులోని ముఖ్యాంశాలు

న్యూడిల్లీ (సెప్టెంబర్ 20) : WOMEN’S RESERVATION BILL 2023 ను “నారీశక్తి వందనమ్ అధీనియమ్” పేరుతో రాజ్యంగ (128వ సవరణ) బిల్లు 2023 ను కేంద్రం లోక్‌సభలో సెప్టెంబర్ 19 వ తేదీన ప్రవేశపెట్టింది.

సెప్టెంబర్ 18న కేంద్ర మంత్రిమండలి చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలోనే బిల్లును పాస్ చేసి అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

★ మహిళల రిజర్వేషన్ బిల్లులో ముఖ్యాంశాలు

లోక్ సభలో, శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఈ సీట్లను భర్తీ చేస్తారు. రాజ్యసభలో, రాష్ట్రాల శాసన మండలిలో ఈ రిజర్వేషన్లు వర్తించవు.

మహిళల కోటాలో మూడో వంతు సీట్లను ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తారు.

నియోజకవర్గాల పునర్విభజన జరిగిన ప్రతిసారి మహిళల రిజర్వ్ సీట్లు రొటేషన్ అవుతుంటాయి. అంటే మహిళకు కేటాయించిన నియోజకవర్గాలు స్థిరంగా ఉండవు.

బిల్లులో ఓబీసీ(ఇతర వెనుకబడిన తరగతులు)లను చేర్చడంపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఓబీసీ మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్
నియోజకవర్గాలు ఉండవు.

ఆంగ్లో-ఇండియన్ మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండవు.

ప్రస్తుతం లోక్ సభలో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా సభ్యుల సంఖ్య 14 శాతం ఉంది. ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లును కనీసం 50 శాతం రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.