Home > BUSINESS > UPI తరహాలో ULI – రుణం పొందడం ఇక సులభం

UPI తరహాలో ULI – రుణం పొందడం ఇక సులభం

BIKKI NEWS (AUG. 27) : UNIFIED LENDING INTERFACE BY RBI. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యూనిఫైడ్‌ లెండింగ్‌ ఇంటర్‌ఫేస్‌ ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇదో సులభతర రుణ సదుపాయ వేదిక. చిన్న, గ్రామీణ రుణ గ్రహీతలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆర్బీఐ తెస్తున్నది.

UNIFIED LENDING INTERFACE BY RBI

రుణ మదింపు, ముఖ్యంగా చిన్న, గ్రామీణ రుణ గ్రహీతలు రుణాలు పొందేటప్పుడు పట్టే సమయాన్ని యూఎల్‌ఐ బాగా తగ్గిస్తుందని ఈ సందర్భంగా శక్తికాంత దాస్‌ తెలియజేశారు.

యూఎల్‌ఐ నిర్మాణం సాధారణ, ప్రామాణిక ఏపీఐలను పోలి ఉంటుందన్నారు. కాబట్టి డాక్యుమెంట్లు కూడా పెద్దగా అవసరం ఉండదని పేర్కొన్నారు. అంతేగాక వ్యవసాయ రుణగ్రహీతలతోపాటు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల రుణగ్రహీతలకూ లాభిస్తుందన్న ఆశాభావాన్ని దాస్‌ వ్యక్తం చేశారు. ‘పైలట్‌ ప్రాజెక్ట్‌ నుంచి వచ్చిన ఫలితం ఆధారంగా యూఎల్‌ఐ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం.

యూపీఐ మాదిరే యూఎల్‌ఐ కూడా ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉన్నది’ అని దాస్‌ తెలిపారు. ఇదిలావుంటే 2016 ఏప్రిల్‌లో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ద్వారా యూపీఐ సేవలను దేశానికి పరిచయం చేశామన్న దాస్‌.. భారత్‌లో రిటైల్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ వృద్ధిలో ఇది కీలకపాత్ర పోషించిందని చెప్పారు.

కాగా, ఆర్బీఐ మార్గదర్శకంలో బ్యాంకులు ప్రమోట్‌ చేసినదే ఈ ఎన్‌పీసీఐ అన్న విషయం తెలిసిందే. బ్యాంకులు, నాన్‌-బ్యాంక్‌ థర్డ్‌ పార్టీ యాప్‌లు, క్యూఆర్‌ కోడ్‌ల వినియోగం.. ఇలా అన్నీ కలిసి యూపీఐకి ప్రజాదరణను తీసుకొచ్చాయి. భారత్‌లోనేగాక, ఆయా దేశాల్లోనూ యూపీఐ ప్రఖ్యాతిగాంచినట్టు దాస్‌ అన్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు