BIKKI NEWS (AUG. 20) : TGPSC GURUKULA PET POSTS RESULTS. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోని కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్ లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి.
TGPSC GURUKULA PET POSTS RESULTS
ముఖ్యంగా సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల ఫలితాలను కమిషన్ ప్రకటించనుంది. 2017లో వెల్లడైన ఈ నోటిఫికేషన్ కు రాత పరీక్షలు పూర్తయినా విద్యార్హతలు, వివిధ సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. వాటన్నింటినీ పరిష్కరించి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెలువరించింది.
ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ముందు అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు తీసుకుంది. వాటి ప్రకారం తుది నియామకాలు చేయనుంది.
గిరి జన గురుకుల సొసైటీలో 83, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, మైనార్టీ గురుకులాల్లో 194, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి.
గురుకుల సొసైటీ నియామకాల్లో జరిగిన పొరపాట్లు టీజీపీఎస్సీ నోటిఫికేషన్లలో తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
తొలుత ప్రభుత్వ విభాగాల్లోని 1,540 ఏఈఈ పోస్టుల నియామకం పూర్తి చేసింది. తరువాత 247 పాలిటెక్నిక్ లెక్చరర్స్ జనరల్ ర్యాంకు జాబితా వెల్లడించింది. అక్టోబరులో ఈ పోస్టులకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయనుంది. ఈ నియామకాలు పూర్తయిన తరువాతే 833 ఏఈ పోస్టులకు ఫలితాలు వెల్లడించనుంది. తద్వారా బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా జాగ్రత్త పడుతోంది.