ENGINEERING COUNSELLING – కన్వీనర్‌ కోటా బీటెక్‌ సీట్లు 70,307

BIKKI NEWS (JULY 08) : TELANGANA BTech seats. తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో బీటెక్‌ కన్వీనర్‌ కోటా సీట్లు 70,307 మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. వెబ్‌ ఆప్షన్లు ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు 173 ఉండగా… వాటిల్లో మొత్తం సీట్లు 98,296. ప్రైవేట్‌ కళాశాలల్లోని సీట్లలో 70 శాతాన్ని కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఆ ప్రకారం ఈసారి 70,307 సీట్లకు విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చు.

గత సంవత్సరం(2023-24) తొలి విడత కౌన్సెలింగ్‌లో 173 కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా…కన్వీనర్‌ కోటా కింద 76,359 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి విడత పూర్తయిన తర్వాత ప్రత్యేక విడత నాటికి సీట్లు పెరిగాయి. ఆ ప్రకారం మొత్తం సీట్లు 1,16,720 అవగా…అందులో కన్వీనర్‌ సీట్లు 85,671. అంటే నిరుడు కంటే ఈసారి సీట్లు తగ్గాయని స్పష్టమవుతోంది. కాకపోతే రెండు, మూడు విడతల కౌన్సెలింగ్‌ నాటికి మళ్లీ సీట్లు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది

ఈసారి డిమాండ్‌ లేని కోర్సులను మూసివేసుకొని వాటి స్థానంలో సీఎస్‌ఈ, సంబంధిత బ్రాంచీల్లో సీట్లను పెంచుకునేందుకు ఆయా కళాశాలలు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాయి. ఆ ప్రకారం దాదాపు 8 వేల వరకు ఉండొచ్చని సమాచారం. పలు కళాశాలలు సీఎస్‌ఈ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), సైబర్‌ సెక్యూరిటీ లాంటి వాటిని కూడా మూసివేసి సీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకొని (కన్వర్షన్‌) అనుమతి తెచ్చుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వాటికి అనుమతి ఇవ్వలేదు. విద్యాశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నందున ఆయన అనుమతి ఇస్తే తప్ప వాటిని కౌన్సెలింగ్‌లో చేర్చరు. రెండో విడత నాటికైనా అనుమతి రావొచ్చని భావిస్తున్నారు.

మరో వైపు ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఆయా కళాశాలలు పెద్ద సంఖ్యలో అదనపు సీట్లకు అనుమతి పొందాయి. అవి దాదాపు 20,500 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వాటికి సర్కారు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు