Home > EMPLOYEES NEWS > 25,733 టీచర్ల తొలగింపు కేసు – సుప్రీంకోర్ట్ లో ఊరట

25,733 టీచర్ల తొలగింపు కేసు – సుప్రీంకోర్ట్ లో ఊరట

BIKKI NEWS (APRIL 29) : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఉపాధ్యాయ నియామక కుంభకోణం (supreme court stay on west Bengal Teachers recruitment Scam) ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో 25,753 మందికి ఊరట లభించింది.

ఇటీవల ఈ కేసులో కలకత్తా హైకోర్టు 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టంచేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తీర్పును సవాల్‌ చేసింది. కోర్టు ఏకపక్షంగా ఆ నియామకాలను రద్దు చేసిందని తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. ‘‘రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులపై సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తున్నాం’’ అని తెలిపింది.

ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.