BIKKI NEWS (AUG. 05) : Revanth Reddy asks investments from Expatriate Indians. “మీరు అమెరికాలో స్థిరపడి ఈ దేశ బలమైన ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డారు. ఇప్పుడు మన తెలంగాణలో మెట్రో, సెమీ అర్బన్, రూరల్ గా మూడు వలయాల ప్రాతిపదికగా జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించండి” అని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారు ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
Revanth Reddy asks investments from Expatriate Indians
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలకు తదుపరి దశగా మహానగరంలో ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్ తో అన్ని హంగులతో నాలుగవ నగరంగా మరో “ఫ్యూచర్ సిటీ” రూపుదిద్దుకోబోతోందని కరతాళ ధ్వనుల మధ్య వివరించారు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో భాగంగా దేశం గర్వించేలా ప్రవాస భారతీయుల ఆర్థిక పెట్టుబడుల మద్దతు అవసరమని చెప్పారు.
“భారత దేశం మన జన్మభూమి. తెలంగాణలో మీవంతుగా ఆర్థిక పెట్టుబడులు పెట్టడం ధర్మం. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఎన్నోరెట్లు ప్రయోజనం చేకూరుతుంది. అందుకు నాదీ గ్యారెంటీ. రాష్ట్రాభివృద్ధికి మీ తోడ్పాటు, భాగస్వామ్యం ఎంతో అవసరం. అది మీకు, మీ జీవితాలకు తప్పకుండా ఎంతో సంతృప్తినిస్తుంది” అని రేవంత్ రెడ్డిగారు సభికుల హర్షద్వానాల మధ్య చెప్పారు.
అధికారంలోకి వచ్చీ రాగానే చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. “మేం అధికారం లోనికి రాగానే విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, టీచర్లకు ప్రజల కిచ్చిన ప్రతి వాగ్దానన్ని నేరవేరుస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉద్యోగ నియామకాలు, రుణమాఫీ, 500లకే గ్యాస్ సిలండర్, 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్తు పథకాలు నిరంతరాయంగా అందిస్తున్నాం. ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కంకణ బద్దులమై ఉన్నాం” అని తెలిపారు. పాలనలో సమతుల్యతను పాటిస్తూ భవిష్యత్తులో వేగవంతమైన రాష్ట్ర స్థిర ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.
సమావేశానంతరం సిఎం రేవంత్ రెడ్డి ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ రాబోయే కాలంలో తెలంగాణలో ఏర్పాటు కాబోయే భారీ కార్పొరేట్ సంస్థల గురించి విశదీకరించారు. తెలంగాణలో సాఫ్ట్ వేర్, ఫార్మా, ఆర్టిఫీషయల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, ఫ్యూచర్ టెక్ రంగాల్లో చైనా దేశానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఎదిగేలా చర్యలు తీసుకోననున్నట్లు దానికి ప్రవాస భారతీయుల పెట్టుబడులకోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.