BIKKI NEWS (SEP. 16) : Rajiv Gandhi Statue unveiled in front tg Secretariat. దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్న సమున్నతమైన ఆశయంతో మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎంగారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు.
Rajiv Gandhi Statue unveiled in front tg Secretariat
దేశ భవితవ్యాన్ని యువత నిర్దేశించాలన్న లక్ష్యంతో 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం, పంచాయతీలే పట్టుగొమ్మలని విశ్వసించి వాటికి నేరుగా నిధులు చేర్చాలన్న సంకల్పంతో 73, 74 వ రాజ్యాంగ సవరణ చేయడం, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, సాంకేతిక విప్లవంతో దేశాన్ని 21 శతాబ్దంలోకి నడిపించడం వంటి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు.
దేశం కోసం నెహ్రూ గారి కుటుంబం సర్వం కోల్పోయిందని, నెహ్రూ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాన్ని ప్రగతి బాటన నడిపించడానికి ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. బాక్రానంగల్, నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్ వంటి ప్రాజెక్టులు ఈనాటికీ నెహ్రూ దూరదృష్టికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు. 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూ గారిదని కొనియాడారు.
బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దుతో పాటు దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరిగేలా భూ పరిమితి చట్టం తెచ్చి జాగీర్దార్లు, జమిందార్ల భూములు పేదలకు పంచిన ఘనత ఇందిరా గాంధీ గారిదని గుర్తు చేశారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాకుండా లంబాడాలను ఎస్టీలలో చేర్చింది ఇందిరా గాంధీ గారని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం దాటుతున్నా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ ప్రకటన వెలువడిన నాటి గుర్తుగా డిసెంబర్ 9 న సచివాలయ ప్రాంగణ ప్రధాన ద్వాారం ముందు వీరనారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని చెప్పారు.