NOBEL PRIZE HISTORY
BIKKI NEWS : ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు. ప్రారంభంలో అయిదు రంగాల్లో (వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి) ఈ పురస్కారాలను అందజేసేవారు. 1969 నుంచి ఆర్థికశాస్త్రానికి కూడా ఈ అవార్డును అందజేస్తున్నారు.
ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ 1833, అక్టోబరు 21న స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో జన్మించారు. ఆయన రసాయన శాస్త్రవేత్తగా, ఇంజినీర్‌గా, పారిశ్రామికవేత్తగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచారు. 1895, నవంబరు 27న పారిస్‌లో రాసిన వీలునామా ప్రకారం తన ఆస్తిలోని 31 మిలియన్ స్వీడిష్ క్రోనార్లతో (సుమారు 265 మిలియన్ డాలర్లు) నిధిని ఏర్పాటు చేసి నోబెల్ బహుమతులను ప్రారంభించారు. 1896, డిసెంబరు 10న ఇటలీలోని శాన్‌రెమోలో మరణించారు.
‘రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ భౌతిక, రసాయన, ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతులను అందిస్తోంది. వైద్యశాస్త్ర నోబెల్‌ను ‘నోబెల్ అసెంబ్లీ ఎట్ ది కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్’, నోబెల్ సాహిత్య అవార్డును ‘స్వీడిష్ అకాడమీ’, నోబెల్ శాంతి బహుమతిని ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ’ ప్రదానం చేస్తున్నాయి.
1968లో స్వీడన్ కేంద్ర బ్యాంకు స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ 300వ వార్షికోత్సవం సందర్భంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మృత్యార్థం ‘ది స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్’ పేరిట ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏర్పాటు చేశారు. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు.
వైద్యం, భౌతిక, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో ఇదే క్రమంలో ఏటా అక్టోబరులో నోబెల్ బహుమతులను ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబరు 10న ఈ ఆరు అవార్డులను అందిస్తారు. శాంతి బహుమతి మినహా మిగిలిన అయిదు పురస్కారాలను స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో స్వీడన్ రాజు ప్రదానం చేస్తారు. నార్వే రాజధాని ఓస్లోలో నార్వే రాజు సమక్షంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ నోబెల్ శాంతి బహుమతిని అందిస్తారు.
NOBEL FIRST WINNERS LST
● భౌతిక శాస్త్రం :: విలియం రాంట్‌జెన్ (జర్మనీ)
● రసాయన శాస్త్రం :: జాకోబ్స్ హెన్రికస్ వాంట్ హాఫ్ (నెదర్లాండ్స్)
● వైద్యశాస్త్రం :: ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (జర్మనీ)
● సాహిత్యం :: సల్లీ ప్రుదొమ్మే (ఫ్రాన్స్)
● శాంతి :: జీన్ హెన్రీ డ్యూనాంట్ (స్విట్జర్లాండ్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)
● ఆర్థికశాస్త్రం :: రాగ్నార్ ఫ్రిష్ (నార్వే), జాన్ టింబర్‌జెన్ (నెదర్లాండ్స్)
◆ NOBEL – INDIAN WINNERS LIST
1. రవీంద్రనాథ్ ఠాగూర్ – 1913 (సాహిత్యం)
2. చంద్రశేఖర్ వెంకటరామన్ – 1930 (భౌతికశాస్త్రం)
3. హరగోబింద్ ఖొరానా – 1968 (వైద్యశాస్త్రం)
4. మదర్ థెరిసా – 1979 (శాంతి)
5. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ – 1983 (భౌతికశాస్త్రం)
6. అమర్త్యసేన్ – 1998 (ఆర్థికశాస్త్రం)
7. వెంకటరామన్ రామకృష్ణన్ – 2009 (రసాయనశాస్త్రం)
8. కైలాష్ సత్యార్థి – 2014 (శాంతి)
9) 9. అభిజిత్ బెనర్జీ (2019) (అర్దశాస్త్రం)
● రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పురస్కారం పొందిన తొలి ఆసియావాసిగా కూడా చరిత్ర సృష్టించారు.
● హరగోబింద్ ఖొరానా 1968లో రాబర్ట్ డబ్ల్యూ హోల్లీ (అమెరికా), మార్షల్ డబ్ల్యూ నిరెన్‌బర్గ్ (అమెరికా)లతో కలసి నోబెల్ వైద్యశాస్త్ర బహుమతిని పంచుకున్నారు.
● 1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అమెరికాకు చెందిన విలియం ఏ. ఫౌలర్‌తో కలిసి నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతిని అందుకున్నారు.
● 2009లో వెంకటరామన్ రామకృష్ణన్ అమెరికాకు చెందిన థామస్ ఏ. స్టిట్జ్, ఇజ్రాయెల్‌కు చెందిన అదా ఇ. యోనత్‌తో కలిసి నోబెల్ రసాయన శాస్త్ర బహుమతిని పంచుకున్నారు.
● 2014లో కైలాష్ సత్యార్థి పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌తో సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని గెలుపొందారు.
● హరగోబింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌లు నోబెల్ పురస్కారాలు పొందేనాటికి అమెరికా పౌరసత్వాలను కలిగి ఉన్నారు. వెంకటరామన్ రామకృష్ణన్ అమెరికా, బ్రిటిష్ పౌరసత్వాలను కలిగి ఉన్నారు.
◆ భారతీయ మూలాలు కలిగిన విదేశీ నోబెల్
గ్రహీతలుగా రోనాల్డ్ రాస్ (1902, వైద్యశాస్త్రం), రుడ్యార్డ్ కిప్లింగ్ (1907, సాహిత్యం)లు గుర్తింపు పొందారు. వీరు బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. బ్రిటన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ పౌరుడు వీఎస్ నైపాల్ 2001లో సాహిత్య నోబెల్‌ను అందుకున్నారు.
ఒక నోబెల్ బహుమతిని అత్యధికంగా ముగ్గురు వ్యక్తులకు ప్రదానం చేయవచ్చు.
1974 నుంచి నోబెల్ బహుమతులను మరణానంతరం ప్రకటించట్లేదు. అంతకుముందు రెండు సార్లు మాత్రమే 1931లో సాహిత్య నోబెల్‌ను ఎరిక్ ఆక్సెల్ కార్ల్‌ఫెల్ట్‌కు, 1961లో నోబెల్ శాంతి బహుమతిని డాగ్ హామర్‌షోల్డ్ (ఐరాస ప్రధాన కార్యదర్శి)కు మరణానంతరం ప్రకటించారు.
నోబెల్ బహుమతి విజేతల్లో అతిపిన్న వయస్కురాలు పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్. 2014లో నోబెల్ శాంతి బహుమతి పొందినపుడు ఈమె వయసు 17 ఏళ్లు.
నోబెల్ పురస్కార గ్రహీతల్లో అత్యంత పెద్ద వయస్కుడు ఆర్థర్ ఆష్కిన్ (96). 2018లో భౌతికశాస్త్ర నోబెల్‌కు ఎంపికవడం ద్వారా ఆయన ఈ రికార్డు సృష్టించారు.
రెడ్‌క్రాస్ సంస్థ (ఐసీఆర్‌సీ – ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్‌క్రాస్) ఇప్పటివరకూ అత్యధికంగా మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. 1917, 1944, 1963ల్లో ఈ ఘనత సాధించింది.
ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ కార్యాలయం (యూఎన్‌హెచ్‌సీఆర్)కు 1954, 1981ల్లో రెండుసార్లు నోబెల్ శాంతి పురస్కారం లభించింది.
నోబెల్‌ను రెండు సార్లు గెలుపొందినవారు
1. మేరీక్యూరీ (ఫ్రాన్స్) – 1903 (భౌతికశాస్త్రం), 1911 (రసాయనశాస్త్రం)
2. లీనస్ పాలింగ్ (అమెరికా) – 1954 (రసాయనశాస్త్రం), 1962 (శాంతి)
3. జాన్ బర్డీన్ (అమెరికా) – 1956, 1972 (భౌతికశాస్త్రం)
4. ఫ్రెడరిక్ శాంగర్ (బ్రిటన్) – 1958, 1980 (రసాయనశాస్త్రం)
1901 నుంచి 2018 వరకు 590 నోబెల్ బహుమతులను 935 మందికి, సంస్థలకు ప్రకటించారు. వీరిలో 51 మంది మహిళలు ఉన్నారు. కొందరు వ్యక్తులు, సంస్థలు ఈ పురస్కారాలను రెండుసార్లు పొందిన నేపథ్యంలో ఈ సంఖ్య 904 వ్యక్తులు, 24 సంస్థలుగా ఉంది.
NOBEL MEDICINE
ఈ పురస్కారాన్ని ఇప్పటివరకు 109 సార్లు ప్రకటించారు. మొత్తం గ్రహీతలు 216 మంది. వీరిలో మహిళా విజేతలు 12 మంది. ఈ అవార్డు అందుకున్నవారిలో అత్యంత పిన్న వయస్కుడు 32 ఏళ్ల ఫ్రెడ్రిక్ జి బాంటింగ్. ఇన్సులిన్‌పై చేసిన పరిశోధనకు 1923లో ఈ అవార్డును అందుకున్నారు. అత్యంత వృద్ధ పరిశోధకుడు 87 ఏళ్ల పేటన్ రౌస్. కణితుల పెరుగుదలకు కారణమయ్యే వైరస్‌లపై చేసిన పరిశోధనకు 1966లో ఈ అవార్డు అందుకున్నారు.
NOBEL PHYSICS
ఇప్పటివరకు భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారాన్ని 112 సార్లు ప్రకటించారు. మొత్తం గ్రహీతలు 210 మంది. వీరిలో మహిళా విజేతలు ముగ్గురు. 1915లో ఈ అవార్డు అందుకున్న 25 ఏళ్ల లారెన్స్ బ్రాగ్ అత్యంత పిన్న వయస్కుడు. అత్యంత పెద్ద వయస్కుడు అమెరికాకు చెందిన 96 ఏళ్ల ఆర్థర్ ఆష్కిన్ (2018).
NOBEL CHEMISTRY
1901 నుంచి 2018 వరకు 110 సార్లు రసాయనశాస్త్ర నోబెల్‌ను ప్రదానం చేశారు. మొత్తం విజేతలు 181. వీరిలో మహిళలు ఐదుగురు. ఈ పురస్కారాన్ని పొందిన అత్యంత పిన్న వయస్కుడు 35 ఏళ్ల ఫ్రెడరిక్ జోలియట్ (1935). అతి పెద్ద వయస్కుడు 85 ఏళ్ల జాన్ బెనెట్ ఫెన్ (2002).
NOBEL LITERATURE
1901 నుంచి 2017 వరకు 110 సార్లు సాహిత్య నోబెల్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మొత్తం విజేతలు 114 మంది. వీరిలో మహిళలు 14 మంది. ఈ పురస్కారాన్ని పొందిన అతి పిన్న వయస్కుడు 41 ఏళ్ల రుడ్యార్డ్ కిప్లింగ్ (1907). అతి పెద్ద వయస్కుడు 88 ఏళ్ల డోరిస్ లెస్సింగ్ (2007).
NOBEL PEACE
ఇప్పటివరకు మొత్తం 99 నోబెల్ శాంతి పురస్కారాలను ప్రకటించారు. మొత్తం 106 మంది, 27 సంస్థలు దీన్ని గెలుచుకున్నాయి. వీరిలో మహిళలు 17 మంది. 2014లో ఈ పురస్కారాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు 17 ఏళ్ల మలాలా యూసఫ్‌జాయ్. అతిపెద్ద వయస్కుడు 87 ఏళ్ల జోసఫ్ రాట్ బ్లాట్ (1995).
NOBEL ECONOMY
1969 నుంచి 2018 వరకు ఆర్థికశాస్త్ర నోబెల్‌ను 50 సార్లు ప్రకటించారు. మొత్తం విజేతలు 81 మంది. వీరిలో ఒక మహిళ ఉన్నారు. ఈ పురస్కారాన్ని పొందిన అతి పిన్న వయస్కుడు 51 ఏళ్ల కెన్నెత్ జె అర్రో (1972), అతిపెద్ద వయస్కుడు 90 ఏళ్ల లియోనిడ్ హార్విక్జ్ (2007)