BIKKI NEWS (JUNE 03) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగు, సాగేతర భూముల మార్కెట్ విలువల పెంపుపై తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగియగానే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు (land market value and registration charges will increase in telangana) వెలువరించే అవకాశం ఉంది.
ఆదాయం పెంచుకునే మార్గాలపై ఇటీవల ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూముల మార్కెట్ విలువలపై ఉన్నతాధికారులతో అంతర్గతంగా చర్చించింది. వాస్తవ ధరలకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉందనే అంశాన్ని అధికారులు సర్కారు దృష్టికి తెచ్చారు.
ధరల పెంపు ప్రాంతాన్ని బట్టి సుమారుగా 22-40% మధ్య ఉండొచ్చనే అంచనాలున్నాయి. సాగు, సాగేతర భూములకు వేర్వేరుగా పెంపును ప్రతిపాదించే వీలుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజులోనూ మార్పు జరిగే అవకాశం ఉంటుందని సమాచారం. వ్యవసాయ భూములకు సంబంధించి ఎకరా కనీస ధర ప్రస్తుతం రూ.75 వేలు ఉండగా, దీనిలోనూ మార్పులు చేయనున్నారని, వాస్తవ ధరలు భారీగా ఉన్న చోట పెంపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్ శివారు జిల్లాల్లో కొన్ని చోట్ల మార్కెట్ విలువ కన్నా వాస్తవ ధర వందల రెట్లు అధికంగా ఉందని నివేదించారు. ఈ నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రస్తుతం ఏ మేరకు ఆదాయం సమకూరుతోంది, భూముల విలువలు ఏ మేరకు పెంచే అవకాశం ఉంటుంది, తద్వారా ఏ మేరకు రాబడి పెరుగుతుందనే సమాచారాన్ని సర్కారు స్వీకరించింది.