BIKKI NEWS (JULY 02) : HYDRA FOR HYDERABAD DISATAER RESPONSE SYSTEM. హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు.
ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు.
ఈ విభాగానికి డీఐజీ స్థాయి అధికారిని డైరెక్టర్‌గా, ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్, వివిధ విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను ఈ విభాగంలో నియమించాలని సూచించారు.
కేవలం వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా ఇకపై విపత్తుల నిర్వహణ విభాగం నగర ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందించేలా పునర్వవస్థీకరించాలని ఆదేశించారు.
మున్సిపల్ వ్యవహారాలు, హెచ్ఎండీఏ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.