Home > TELANGANA > ఎండల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్

ఎండల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్

BIKKI NEWS (MARCH 31) : తెలంగాణ రాష్ట్రానికి వడగాలుల (Heat waves in telangana and Yellow alert) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మార్చి 31 నుంచి ఎప్రిల్ 3వ తేదీ వరకు పగటి పూట వడగాలులు వీచే పరిస్థితులు ఉన్నట్లు శనివారం ప్రకటించింది.

ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను తాకింది. రాత్రుళ్లు కూడా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది.

రాష్ట్రంలో 16 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ ఏడాది మొదటిసారి వడగాలులు నల్గొండ జిల్లాలో నమోదయ్యాయి. శనివారం వేములపల్లి మండలంలో 42.7 డిగ్రీలు, నిడమనూరు మండలంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా ఇక్కడ వడగాలులు వీస్తున్నట్లు గుర్తించారు. శనివారం ఖమ్మంలో సాధారణం కన్నా 4.2 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీలు నమోదయ్యాయి.