Home > NATIONAL > HEALTH INSURANCE – 65 ఏళ్ళు దాటినా ఆరోగ్య బీమా

HEALTH INSURANCE – 65 ఏళ్ళు దాటినా ఆరోగ్య బీమా

BIKKI NEWS (APRIL 22) ఆరోగ్య బీమా రంగంలో పాలసీదారుల వయోపరిమితి ని తొలగిస్తూ ‘భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సాధికారిక సంస్థ’ (IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా ఇకపై 65 ఏళ్లకు పైబడిన వారు కూడా ఆరోగ్య బీమా చేసుకోవటానికి వీలవుతుంది. ఏప్రిల్‌ 1 నుంచే ఈ కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందని (Health insurance for all ages and all diseases) ఐఆర్‌డీఏఐ తెలిపింది.

ఇక మీదట అన్ని వయసుల వారికి సరిపోయే ఆరోగ్య బీమా పథకాలను ఇన్సూరెన్స్‌ కంపెనీలు తీసుకురావాలని పేర్కొంది.

సీనియర్‌ సిటిజన్లకు అవసరమైన సేవలను అందించాలని, బీమా చెల్లింపులకు (క్లెయిమ్స్‌కు) సంబంధించి వారి కోసమే ప్రత్యేకంగా కొన్ని విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

క్యాన్సర్‌, గుండె, కిడ్నీ జబ్బులు, ఎయిడ్స్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్య బీమా పథకాలను అందించాలని సూచించింది.

ఆరోగ్య బీమా తీసుకున్న తర్వాత అన్ని వ్యాధులకూ అది వర్తించటానికి ప్రస్తుతం అమలులో ఉన్న 48 నెలల వెయిటింగ్‌ పీరియడ్‌ను 36 నెలలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది.

పాలసీదారు తన జబ్బుల గురించి వెల్లడించినా, వెల్లడించకపోయినా, బీమా తీసుకున్న 36 నెలల తర్వాత అన్ని జబ్బులకూ బీమా ఇవ్వాల్సిందేనని ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఆదేశించింది.

ప్రస్తుతం ఆస్పత్రిలో తీసుకున్న చికిత్స వ్యయాన్ని భరించేలా ఆరోగ్య బీమా పథకాలు ఉంటున్న విషయం తెలిసిందే. దీని బదులుగా నిర్ణీత వ్యాధులకు నిర్ణీత బీమా సొమ్ము కంపెనీలు అందించాలని, తద్వారా పాలసీదారులకు తమ వద్ద ఉన్న బీమా పథకం గురించి ముందే స్పష్టత ఉంటుందని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

ఆరోగ్య బీమాపై మారటోరియం వ్యవధిని కూడా ఇప్పుడున్న 8 ఏళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. అంటే, ఐదేళ్లపాటు ప్రీమియం చెల్లిస్తే బీమా పథకంలోని అన్ని సేవలనూ పాలసీదారులకు కంపెనీ అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఐఆర్‌డీఏఐ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.