BIKKI NEWS (MARCH 29) : తెలంగాణ రాష్ట్ర గురుకుల నియామకాల్లో మిగిలిపోయిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని (gurukula posts recruit as per merit orders high court) రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని సూచించింది. దీనిపై తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణను వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది
★ అవరోహణ క్రమంలో నింపకపోవడమే కారణం
అభ్యర్థులు పోస్టులు వదులుకోవడంతో, గురుకులాల్లో డిగ్రీ అధ్యాపకులు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టుల భర్తీ కోసం 2023 ఏప్రిల్ 5న తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే ఈ నియామకాలను అవరోహణ క్రమంలో ఎగువ స్థాయి పోస్టులను ముందు, దిగువ స్థాయి పోస్టులను తర్వాత) చేపట్టాల్సి ఉన్నా.. ఒకేసారి అన్ని ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీనితో మూడు, నాలుగు పోస్టులకు ఎంపికైన మెరిట్ అభ్యర్థులు ముఖ్యమైన పోస్టులను ఎంచుకోగా, మిగతా పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.
ఇలా మిగిలిన పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని కోరుతూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది హిమాగ్జి వాదనలు వినిపిస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చి న పోస్టులన్నీ భర్తీ కాకుండా మిగిలిపోతే, వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో నింపవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. పిటిషనర్లు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారని కోర్టుకు విన్నవించారు.
బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారని.. మిగిలిన ఖాళీల్లో పిటిషనర్లను భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తదుపరి గురుకుల నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.