Home > TELANGANA > రైతులకు పంట రుణాలు ఇవ్వండి – బ్యాంకర్ల సమావేశంలో భట్టి

రైతులకు పంట రుణాలు ఇవ్వండి – బ్యాంకర్ల సమావేశంలో భట్టి

BIKKI NEWS (MARCH 14) : హైదరాబాద్ లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 40వ త్రైమాసిక సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా బ్యాంక‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిర‌మ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయాన్ని ప్రాధ‌న్య‌త‌గా తీసుకున్న‌ద‌ని అన్నారు. ప్ర‌భుత్వం ప్రాధ‌న్య‌త‌గా తీసుకున్న వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌ను ముందుకు తీసుకుపోవ‌డానికి బ్యాంక్ల‌రు సైతం స‌హ‌క‌రించాల‌ని (fresh crop loans for farmers) కోరారు.

గ‌త పాల‌న‌లో చాలా మంది రైతుల‌వి ఇర్రెగ్యుల‌ర్ ఆకౌంట్స్‌గా మారాయని వారికి ఫ్రెష్‌గా రుణాలు ఇవ్వాల‌న్నారు. రుణాలు ఇచ్చే విషయంలో రైతుల పట్ల నిర్లక్ష్యం, అసహనం ప్రదర్శిస్తే సాగు పెట్టుబ‌డి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రుణ భారం తీర‌క అప్పులు చెల్లించ‌లేక ఆత్మహత్యలకు దారితీసే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

అదే విధంగా వ్యవసాయం, హౌసింగ్, విద్యకు ఇచ్చే రుణాలను బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.

వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపుల విష‌యంలో బ్యాంక‌ర్లు వన్ టైం సెటిల్మెంట్ చేయాల‌ని కోరారు.

రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదన్నారు. స్వ‌యం ఉపాధి కొర‌కు యువ‌త‌కు రుణాలు ఇవ్వాల‌ని కోరారు.

రాష్ట్రంలో స్వ‌యం స‌హ‌య‌క సంఘంలో ఉన్న మ‌హిళ స‌భ్యుల‌ను కోటీశ్వ‌రులుగా చేయాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా బ్యాంక‌ర్లు స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వల‌న్నారు. రానున్న ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రూపాయ‌ల‌ను వ‌డ్డి లేకుండ రాష్ట్ర ప్ర‌భుత్వం రుణాలు ఇప్పించ‌బోతున్న కార్యాక్ర‌మానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వం చెల్లిస్తుంద‌న్నారు.

ఆంధ్ర బ్యాంకు డైరెక్టర్ గా తాను ఉన్న సమయంలో విద్య రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభం అయ్యాయని, 20 ఏండ్లు అవుతున్న‌ ఆ రుణాల జారీలో ప్రగతి కనిపించడం లేదన్నారు.

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి సంపదను కింది వర్గాలకు తీసుకెళ్లింద‌న్నారు. సంప‌ద సృష్టిక‌ర్త‌ల‌కు బ్యాంక‌ర్లు తోడ్పాటు అవ్వ‌డం వ‌ల్ల తెలంగాణ ధనిక రాష్ట్రంలో సృష్టించే సంప‌ద ప్ర‌జ‌ల‌కు పంచ‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

పెట్టుబ‌డులకు హైద‌రాబాద్ అనువైన ప్రాంత‌మ‌న్నారు. రీజిన‌ల్ రింగ్ రోడ్డు, ఆవుట‌ర్ రింగ్ రోడ్డు మ‌ధ్య‌న ప్రభుత్వం క్ల‌స్ట‌ర్‌డను ఏర్పాటు చోయ‌బోతున్న‌ద‌ని తెలిపారు. వీటి మ‌ధ్య‌న ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న పెద్ద ఎత్తున ఉండ‌బోతుంద‌న్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల్లో ప్రజలకు ప్రాధాన్యత ఉన్న పథకాలను గుర్తించి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి బ్యాంకర్లు సహకరించాలన్నారు. రుణాలు ఇచ్చే విష‌యంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దేశ సంపద రైతులని, దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానం వ్యవసాయమ‌న్నారు.

దేశంలో వ్యవసాయం సంక్షోభంలోకి పోతే ఆహారం కొరత ఏర్పడే ముప్పు ఉందన్నారు. అందుక‌నే రైతుల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. రాష్ట్రంలో విచిన్నమైన వ్యవస్థలను సరి చేసి ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చాలని లక్ష్యంతో అంకితభావంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ఆ ల‌క్ష్యాల‌ను చేరుకునే విధంగా బ్యాంక‌ర్ల ప‌నితీరు ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గట్టుగా పాల ఉత్పత్తి లేదని, పాడి పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకు వచ్చే రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి ప్రోత్స‌హించాల‌న్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ నిబద్ధతగా ఉండాలని, ఎట్టి ప‌రిస్థితుల్లో క‌లుషితం కావొద్ద‌ని హిత‌వు ప‌లికారు. వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తే సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన‌ట్టే అవుతుంద‌న్నారు.

ఆనంత‌రం పట్టు గూళ్ల పెంపకం రైతులకు 1, 83, 41,000 రూపాయల ప్రోత్సాహక ఇన్సెంటివ్ చెక్కును అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్ధిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ఎస్‌బిఐ సీజీఎం రాజేష్‌కుమార్‌, ఎస్ఎల్‌బిసి క‌న్వీన‌ర్ మిత్ర‌, నాబార్డ్ జీఎం పిపి ఉషా, అధికారులు శార‌ధ‌, జ‌గ‌దీష్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.