AROGYA SRI – రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ

BIKKI NEWS (MARCH – 14) : తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని రేషన్‌ కార్డు, ప్రజల ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రజలందరికీ వర్తించేలా (Arogya sri card for all with out ration cards) ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా లబ్ధిదారులకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరుతో కొత్త కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల గుర్తింపు, ఇతర మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ప్రత్యేక నంబర్‌ కేటాయించి కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందిస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం, ఈ వివరాలను ఆరోగ్యశ్రీ కార్డులతో అనుసంధానం చేయనున్నది. రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.

ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షలకుపైగా తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. మిగతా వారిలో ప్రభుత్వ ఉద్యోగులు వంటివారు ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్‌ స్కీమ్‌ ను అమలు చేయాల్సి వస్తున్నది. దీంతో 90 శాతానికిపైగా జనాభాకు ప్రభుత్వ హెల్త్‌ స్కీం వర్తిస్తున్నదని వైద్యశాఖ చెప్తున్నది. మిగతావారిని కవర్‌ చేసి, రేషన్‌ కార్డుతో లింక్‌ తీసేస్తే కార్డుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇలా చేస్తే ప్రభుత్వంపై ఏటా దాదాపు రూ.450 కోట్ల మేర కు అదనపు భారం పడుతుందని అంచనా.

ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం అందిస్తున్న 1,670 రకాల చికిత్సలకు అదనంగా మరో 100 చికిత్సలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. తమకు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదంటూ ఇప్పటివరకు వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా వీటిని ఎంపిక చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన నేపథ్యంలో విలువైన చికిత్సలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్యాకేజీల ధరలను కూడా సవరించాలని భావిస్తున్నట్టు సమాచారం.