BIKKI NEWS (DEC – 10) : వేళ్లు లేని వారు, వేలి ముద్రలు సరిగా పడనివారు, ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని (aadhar without fingers and iris ) కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వేళ్లు లేవని, వేలి ముద్రలు సరిగా పడటం లేదన్న పేరుతో ఆధార్ ను తిరస్కరించలేరని స్పష్టం చేశారు.
వేలి ముద్రలు ఇవ్వలేని వాళ్లు ఐరిస్ స్కాన్ ద్వారా, ఐరిస్ సరిగా రానివాళ్లు వేలిముద్రల ద్వారా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఎవరికైనా వేలి ముద్రలు, ఐరిస్ రెండూ లేకపోతే అవి లేకుండానే ఆధార్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అలాంటి వారు బయోమె ట్రిక్ ఎక్సెప్షన్ ఎన్రోల్మెంట్ గైడ్లైన్స్ కింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించి, అందుబాటులో ఉన్న బయోమెట్రిక్స్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. వాళ్ళ దగ్గర ఏయే అంశాలు లేవో ఆ వివరాలను ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్ నమోదు చేయడంతోపాటు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఫొటోగ్రాఫ్ తీసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించిన అనంతరం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ సూపర్వైజర్ ధ్రువీకరిస్తే సరిపోతుందని వెల్లడించారు.