Home > CURRENT AFFAIRS > AWARDS > NOBEL 2018 – WINNERS LIST

NOBEL 2018 – WINNERS LIST

BIKKI NEWS : 2018 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. వైద్య, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో విశేష కృషి చేసినవారికి ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతిని (NOBEL 2018 – WINNERS LIST) అందిస్తారు.

సాహిత్య రంగంలో అవార్డును ఎంపిక చేసే అకాడమీ సభ్యుడిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఈ ఏడాది సాహిత్య రంగంలో నోబెల్‌ను ప్రకటించకుండా వాయిదా వేశారు. 1949 తర్వాత ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబరు 10న స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో వీరికి బహుమతి ప్రదానం చేస్తారు.


సాహిత్యం – ప్రకటించలేదు
శాంతి – డెనిస్ ముక్వెగె, నదియా మురాద్
ఆర్థిక – విలియం నార్డ్‌హాస్, పాల్ రోమర్
వైద్యం – జేమ్స్ పి. అల్లిసన్, తసుకు హోంజో 
భౌతిక – ఆర్థర్ ఆష్కిన్, గెరార్డ్ మౌరో, డోనా             స్ట్రిక్‌ల్యాండ్
రసాయన – ఫ్రాన్సిస్ అర్నాల్డ్, జార్జ్ పి స్మిత్, గ్రెగరీ వింటర్.

◆ వైద్య రంగం

క్యాన్సర్‌పై ఇమ్యునో థెరపీ కి వైద్యశాస్త్రంలో నోబెల్
క్యాన్సర్ వ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రవేత్తలు జేమ్స్ పి. అల్లిసన్ (అమెరికా), తసుకు హోంజో (జపాన్)కు వైద్యశాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించారు. మానవ శరీరంలోని సహజసిద్ధమైన రోగ నిరోధక శక్తి సహాయంతో క్యాన్సర్‌ను జయించే విధానాన్ని కనుక్కున్నందుకు వీరికి ఈ పురస్కారం దక్కింది. అల్లిసన్, హోంజోలు ఇమ్యునో థెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా క్యాన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధకశక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు.  వీరి పరిశోధనలకు 2014లో ‘ఆసియా నోబెల్‌’గా పరిగణించే ట్యాంగ్‌ప్రైజ్‌ను గెల్చుకున్నారు.


◆ భౌతికశాస్త్ర నోబెల్

ఆప్టికల్ లేజర్‌కు భౌతికశాస్త్ర నోబెల్
సునిశిత నేత్ర చికిత్సకు ఉపకరించే సూక్ష్మ పరికరాల రూపకల్పన దిశగా లేజర్ ఫిజిక్స్‌పై పరిశోధనలు చేసిన ముగ్గురికి 2018 సంవత్సరానికి భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. అమెరికాకు చెందిన ఆర్థర్ ఆష్కిన్ (96), ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్ మౌరో (74), కెనడా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్‌ల్యాండ్ (55)ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 
 

నోబెల్ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆష్కిన్ నిలిచారు. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్ హుర్విజ్ 90 ఏళ్ల వయసులో నోబెల్ పొందారు. నోబెల్ పురస్కారాల చరిత్రలో భౌతికశాస్త్ర విభాగం కింద అవార్డుకు ఎంపికైన మూడో మహిళ డోనా. ఈమె కంటే ముందు 1903లో మేడం క్యూరీ, 1963లో గోపర్ట్ మేయర్ భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి పొందారు.


రసాయనశాస్త్ర నోబెల్

కొత్త ఎంజైముల సృష్టికర్తలకు రసాయనశాస్త్ర నోబెల్
రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. వీరిలో అమెరికాకు చెందిన పరిశోధకురాలు ఫ్రాన్సిస్ అర్నాల్డ్, పరిశోధకుడు జార్జ్ పి స్మిత్, బ్రిటన్‌కు చెందిన గ్రెగరీ వింటర్ ఉన్నారు. వీరు ముగ్గురూ పరిణామ సమీకరణం ద్వారా కొత్త ఎంజైములు సృష్టించి ఆసక్తికర ఫలితాలు సాధించారు. ఈ కొత్త ఎంజైముల ఆధారంగా జీవ వైవిధ్య ఇంధనం, ఔషధాలను తయారు చేయవచ్చు. ‘పరిణామక్రమాన్ని నియంత్రించి మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చే విధంగా ఎంజైములను ఉపయోగించడంలో వీరు కృషిచేశారు’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ దక్కించుకున్న అయిదో మహిళ అర్నాల్డ్. 


నోబెల్ శాంతి

లైంగిక హింసపై పోరాటానికి నోబెల్ శాంతి
ప్రపంచ వ్యాప్తంగా ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇద్దరిని ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ డెనిస్ ముక్వెగె (63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్ (25)లను 2018 నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు కమిటీ ఛైర్మన్ బెరిట్ రెయిస్ అండర్సన్ ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ప్రముఖుల బండారాన్ని బయటపెట్టడంతోపాటు లైంగికదాడి బాధితుల్లో ధైర్యాన్ని నింపిన ‘మీటూ’ ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా నోబెల్ శాంతి బహుమతి ఎంపిక కమిటీ ఈ ఏడాది లైంగిక హింసను ప్రధాన అంశంగా ఎంచుకుంది. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరూ ఎంతో పోరాడారని నార్వేజియన్ నోబెల్ ఎంపిక కమిటీ ప్రశంసించింది.

ఆర్థిక నోబెల్

హరితవృద్ధి నిపుణులకు ఆర్థిక నోబెల్
‘హరిత వృద్ధి’ నిపుణులకు 2018కిగాను ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఆర్థికాభివృద్ధిని, వాతావరణ విధానాలను ఎలా అనుసంధానించాలో ప్రపంచానికి తెలియజేసిన అమెరికా ఆర్థికవేత్తల ద్వయం విలియం నార్డ్‌హాస్, పాల్ రోమర్ సంయుక్తంగా ఈ ఏడాది అర్థశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థికవృద్ధితో జోడించినందుకు వారిని ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దీర్ఘకాలంపాటు నిలదొక్కుకునేలా, నిలకడైన వృద్ధిని సృష్టించడంలో వీరు చేసిన కృషి అమోఘమైందని ప్రశంసించింది. పర్యావరణ అనుకూల (గ్రీన్‌గ్రోత్) వృద్ధి నమూనాలను రూపొందించటంలో వీరిద్దరూ స్వతంత్రంగా పని చేస్తూ అద్భుతమైన ఫలితాలను రాబట్టారని శ్లాఘించింది. 1990ల్లోనే వీరిద్దరూ ఈ పద్ధతులను అభివృద్ధి చేశారని అకాడమీ తెలిపింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, వీరిద్దరూ ఈ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు.