- రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదు అని కీలక తీర్పు.
- రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు సంరక్షణ దారు సుప్రీంకోర్టు అని తీర్పు
న్యూడిల్లీ (ఎప్రిల్ – 24) : కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసుగా (kesavananda bharathi vs state of kerala case) ప్రాచుర్యం పొందిన కేశవానంద భారతి కేసు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని, పౌరుల ప్రాథమిక హక్కుల అంశంపై కీలక తీర్పుగా భావిస్తారు. ఏప్రిల్ 24 1973న ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. దీంతో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సుప్రీంకోర్టు ప్రత్యేక వెబ్ పేజీని విడుదల చేసింది. ఈ కేసు తదనంతరం అనేక కేసులకు మార్గదర్శకంగా నిలిచింది.
కేరళ ప్రభుత్వం ఆశ్రమాల ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మిక గురువు కేశవానంద భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పార్లమెంటు చేసిన 24, 25, 29వ రాజ్యాంగ సవరణల చెల్లుబాటును ఆయన సవాలు చేశారు. ఈ సవరణలు న్యాయ వ్యవస్థ అధికారాలతోపాటు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై 1972 అక్టోబర్ 31న ప్రారంభమైన విచారణ 1973 మార్చి 24 వరకు సాగింది. అప్పట్లో ఈ కేసును 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. ఒక కేసు కోసం 13 మంది న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలోనే మొదటిసారి.
అయితే, విచారణ సందర్భంగా రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలు, మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు ఉందా? లేదా? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. 68 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన విస్తృత ధర్మాసనం.. రాజ్యాంగ మౌలిక సిద్ధాంతానికి సుప్రీంకోర్టే సంరక్షణదారు అని చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఏ విషయంలోనైనా సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ.. మౌలిక స్వరూపాన్ని, ప్రాథమిక హక్కులను మార్చలేదని తెలిపింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం వాటి సంరక్షణ బాధ్యత చూస్తుందని స్పష్టం చేసింది. దీనర్థం.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య, చట్టం అందరికీ సమానం వంటివి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తెలిపింది.
కేశవానంద భారతి కేసు పై సుప్రీంకోర్టు ప్రారంభించిన వెబ్ పేజీ లింక్