కొత్త జోన్ల ప్రకారం బదిలీలకు సర్కారు యోచన

తెలంగాణలో కొత్త జోనల్‌ విధానానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో కొత్త జోన్స్ వారీగా ఉద్యోగులను వారి సొంత జోన్లకు బదిలీ చేసే ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

త్వరలో ఈ జోనల్ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దీనికోసం ఉద్యోగులకు ఆప్షన్ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

2016లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ టు సర్వ్‌ విధానంలో తాత్కాలిక విధుల పేరిట ఉద్యోగులను బదిలీ చేసింది. అలాగే పది ఉమ్మడి జిల్లాలు, రెండు జోన్ల ప్రాతిపదికన ఉద్యోగులను నియమించింది. వేలమంది సొంత జోన్లలో గాకుండా ఇతర జోన్స్ లో నియమితులయ్యారు.

తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి దీనిపై చర్చించారు. వారి సూచనల నేపథ్యంలో కార్యాచరణ రూపొందించి, బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.