మహిళా ఉద్యోగులకు రేపు సెలవు – ఒప్పంద మహిళ ఉద్యోగుల విషయంలో లేని స్పష్టత !

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేపు(సోమ‌వారం) సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్‌ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ సర్క్యూలర్‌ జారీ చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. మహిళా సాధికారత కేంద్రంగా తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. మహిళలను అభివృద్ధిపథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్‌, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వి-హబ్‌ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ మహిళ ఉద్యోగుల పట్ల లేని స్పష్టత ::

కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ మరియు ఇతర తాత్కాలిక మహిళ ఉద్యోగులకు ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉత్తర్వులు వరిస్తాయా లేవా అనే సందిగ్ధం ఉంది. సంబంధిత శాఖల నుండి వచ్చే ఉత్తర్వులలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us@