Home > LATEST NEWS > కవి ప్రపంచానికి ఏమవుతాడు – ఆడ్డగూడి ఉమాదేవి

కవి ప్రపంచానికి ఏమవుతాడు – ఆడ్డగూడి ఉమాదేవి

BIKKI NEWS (MAR. 21) : World Poetry Day special poetry by Addagudi Umadevi. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త అయిన ఆడ్డగూడి ఉమాదేవి ప్రత్యేక కవిత్వం…

World Poetry Day special poetry by Addagudi Umadevi

ఆవేశాక్షర శరాలను సంధిస్తూ
సమసమాజ నిర్మాణానికి అంకుశమవుతాడు

పదనెక్కిన పదమై పద్మవ్యూహాలను ఛేదిస్తూ
అభ్యుదయ పథ దిక్సూచిలా సాగుతాడు

వడిగొను వాక్య వాతూలమై వర్ణాలను మట్టిలో కలుపుతూ నిచ్చెన మెట్లను కూల్చుతాడు

గర్జించు గ్రంథమై గురివిందగింజల నిజరూపుకు నిలువెత్తు సాక్షమౌతాడు

పేకమేడల కలల సౌధాలకు పునాదియై
చెదిరిన బతుకులకు చేయూతగ నిలుస్తాడు

నిశ్శబ్ద శబ్దాల సారమై మనసు పొరలను తాకుతూ
అనంత భావావేశ ఉత్తుంగ తరంగాల సింధువవుతాడు

అక్షరమై,పదమై,వాక్యమై,గ్రంథమై రవి గాంచని చోటుకు సాగుతూ
అక్షర శిల్పియై పొత్తమందు వెలుగుతాడు


కవిత్వం

మాతృ స్పర్శకై పరితపించే
పసి హృదయపు తొలి నాదం కవిత్వం

బిడ్డనూరడించ అలవోకగా తల్లిపాడే జోలపాట కవిత్వం

శ్రమజీవుల స్వేదబిందువుల నాదం కవిత్వం

మూగబోయిన గొంతుల ధిక్కార గళం కవిత్వం

అణచబడిన వర్గాల సమానత్వ ఘోష కవిత్వం

శ్రమదోపిడినెదిరించు ఎర్రసూరీడుల తిరుగుబాటు కవిత్వం

మనసులు మాట్లాడుకునే మూగ భాష కవిత్వం

తలపండినవారి అలవోకపు మాటలలో ఉంది అసలు సిసలు కవిత్వం

స్పందించే గుణం నీకుండాలి గానీ ఎందులో లేదు కవిత్వం

అంతటా నిబిడీకృతమైన నిశ్శబ్ద విప్లవం కవిత్వం


అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రి కళాశాల – వరంగల్ – 9908057980

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు