BIKKI NEWS (JAN. 17) : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్(C4IR)’ను హైదరాబాద్‌లో (World Economic Fund Centre in Hyderabad) ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా-2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం (16న) వేదిక అధ్యక్షుడు బర్గె బ్రెండ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరిపింది. అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు.
జీవ వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో నెలకొల్పనున్న ఈ కేంద్రానికి ప్రపంచ ఆర్థిక వేదిక పరిపూర్ణ సహకారాన్ని అందించనున్నట్లు బర్గె బ్రెండ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మెరుగుదలకు సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపకల్పనలో ఈ కేంద్రం ద్వారా మార్గం సుగమమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘ప్రపంచ ఆర్థిక వేదిక విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయి. అందుకే రెండింటి మధ్య అద్భుతమైన సమన్వయం కుదిరింది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం. ప్రపంచ ఆర్థిక వేదిక అంతర్జాతీయ స్థాయిలో పని చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఉభయుల భాగస్వామ్యంతో ప్రజలకు ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ విధానాలను సరి కొత్తగా పునర్నిర్వచించే ఆలోచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.