- అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రఖ్యాత వ్యాస రచయిత అస్నాల శ్రీనివాస్ వ్యాసం
BIKKI NEWS (MARCH – 08) : మార్చి – 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం 2024ని ‘INVEST IN WOMEN-ACCELERATE PROGRESS’(మహిళలపై పెట్టుబడులు పెట్టండి-పురోగతిని వేగవంతం చేయండి. ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం కోసము మహిళా లోకము సిద్దమవుతున్నది.కాలం గడుస్తున్న కొద్ది లింగ సమానత్వం అతి పెద్ద సవాల్ గా మారుతున్నది. సమగ్ర సమాజ నిర్మాణానికి మహిళల వికాసం కోసం పెట్టుబడి అత్యంత అవసరమైన మానవ హక్కుగా పరిణిమించింది. పలు రకాల సంక్షోభాలు ప్రపంచ మనుగడకు సవాల్ విసురుతున్నాయి. ఇది అంతిమంగా మహిళల బాలికల హక్కులకు,జీవన మనుగడపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు -2030 లింగ సమానత్వ సాధన సమీప భవిష్యత్ లో సాకారం వైపుగా కనిపించడం లేదు.
సమగ్ర సమాజ నిర్మాణానికి మహిళల వికాసం కోసం పెట్టుబడి అత్యంత అవసరమైన మానవ హక్కుగా పరిణిమించింది. – అస్నాల శ్రీనివాస్
భోగోళిక రాజకీయ వైరుధ్యాలు,వాతావరణ విపత్తులు,ఆర్థిక సంక్షోభం.యుద్ధాలు కారణంగా 2020 నుండి అదనంగా 75 బిలియన్ ల ప్రజలు తీవ్ర పేదరికంలోకి నెట్టబడ్డారు. పెరుగుతున్న చమురు ధరలు,ఆహార ధరల కారణంగా అనేక దేశాలు సంక్షేమ బడ్జెట్ లో 75% వ్యయాన్ని తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా, ఉక్రేయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో మహిళల బాలికల మనుగడ ఆందోళన స్థాయికి చేరుకుంది. ఇది మహిళల సామాజిక భద్రతకు అత్యవసర సేవలకు విఘాతం కల్గిస్తుంది. ఈ క్రమంలో మహిళల పై పెట్టుబడులు తక్షణ చర్యగా యు యన్ నిర్ణయించింది.
మానవజాతి చరిత్రలో స్త్రీల హక్కులే మానవ హక్కులుగా భావించి వారి ఉన్నతి కోసం అన్ని రకాల ఆధిపత్యాల నుండి ,శ్రమదోపిడి నుండి విముక్తి కోసం పోరాడిన సంఘ సంస్కర్తల, పొరాటకారులను స్మరించుకుని, ఇప్పటిదాకా సాధించుకున్న హక్కులను, విజయాలను పటిష్టం చేసుకుని, ఇంకా సాధించుకోవల్సిన హక్కుల కోసం సరైన మార్గాలను రూపొందించుకుని మరింత సమత్య దిశగా ప్రస్థానం కొనసాగించడానికి చారిత్రకరమైన పాత్రను నిర్వర్తించడం కోసము కదులుతున్నారు. లింగ సమానత్వంతో నూతన ప్రపంచ నిర్మాణం జరుగుతుందని ఈ దిశగా ప్రచార కార్యక్రమాలు, ఉత్సవాలను జరపాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. “సమభావపు ఆలోచన ,చురుకుగా నిర్మించడం ,పురోగమనం కోసం విన్నూత్నత ” (think equal build smart innovate for change )(inspire women-strong -enduring-shape-build-we forge a better world )ఇతివృత్తంతో విద్య, ఉద్యోగ, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, క్రీడా, ఉత్పాదక, ప్రచారమాధ్యమాలలో స్త్రీల భాగస్వామ్యం ఎక్కువ చేసే విధంగా కృషి కొనసాగాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో, సమాజప్రగతితో స్త్రీల పాత్ర అత్యంత ఆవశ్యకమైనదిగా భావించి, ఆయా ప్రభుత్వాలు, పౌరసమాజం బాధ్యతలను పంచుకుని, సమిష్టి చర్యలతో కార్యాచరణ చేపట్టాలని సూచించింది.
భారతదేశంలో మహిళహక్కుల ఉద్యమాలకు సుధీర్ఘ చరిత్ర ఉంది. పురాణాల్లో పితృస్వామిక విలువలను ధిక్కరించిన జ్ఞాన సంపన్నులైన గార్గి మైత్రేయి, విద్యాధరిల ప్రస్తావన ఉంది. – అస్నాల శ్రీనివాస్
భారతదేశంలో మహిళహక్కుల ఉద్యమాలకు సుధీర్ఘ చరిత్ర ఉంది. పురాణాల్లో పితృస్వామిక విలువలను ధిక్కరించిన జ్ఞాన సంపన్నులైన గార్గి మైత్రేయి, విద్యాధరిల ప్రస్తావన ఉంది. చరిత్రలో బౌద్ధం, చార్వాకం ప్రాబల్యం ఉన్న కాలంలో, మౌర్యుల పాలనలో స్త్రీలను కూడ పౌరులుగా భావించి అన్ని అవకాశాలలో సమానత్వంను ఆచరించారు. భారత సమాజాన్ని వందలాది సంవత్సరాలుగా ”మనుస్మృతి” ప్రభావితం చేసింది. ఇది శూద్రులను, బానిసలను, అన్ని వర్గాల స్త్రీలను ఒకే సమూహంగా పరిగణించి ఆమానవీయ ఆంక్షలను ఏర్పాటు చేసింది. స్త్రీలకు స్వాతంత్రం ఉండకూడదని, విద్యను నేర్చుకోరాదని, వివాహ స్వేచ్ఛ ఉండరాదని, సతిని ఆచరించాలని, నిత్యం పురుషుడి ఆధీనంలోకి ఉండాలని ,వస్తువుగా భావించి అమ్ముకోవచ్చని ఇలా అనేక ఆంక్షలను పాటించేలా చేసింది .భారత సమాజంలో స్త్రీ జీవితం దారుణంగా దిగజారడానికి, అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి తోసి పడేయడానికి వారి పట్ల కనీస గౌరవం లేకుండా మనువు తన ధర్మ శాస్త్రాలను నిర్మించాడు.
రాజరికపు కాలంలో అనివార్య పరిస్థితులలో పాలనను చేపట్టి, పరాయి పాలనను ధిక్కరించి పోరాడిన ఝాన్సీ లక్ష్మిబాయి, రాణి అజుందనీ, బేగం అలియా, బేగం హజ్రత్‌మహల్, రాణి చెన్నమ్మ, రుద్రమదేవీలు చరిత్రలో కనిపిస్తారు. బ్రిటిష్ ఇండియాలో రాజారాం మోహన్ రాయ్, పూలే దపంతులు, అంబేద్కర్, రనడేల నాయకత్వంలో సంఘసంస్కరణ మహిళా జనోద్దరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. సతి, ఆడశిశువుల హత్యను నిరోధించే చట్టాలు ఉనికిలోకి వచ్చాయి. జాతీయోద్యమంలో పాల్గొన్న లక్షలాది మహిళల త్యాగాలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర భారత్‌లో లింగ వివక్షకు తావులేకుండ పాలన కొనసాగాలని రాజ్యంగ రక్షణలను ఏర్పాటు చేసారు. స్త్రీలు సాధించిన ప్రగతి ఆధారంగా సమాజ అభివృద్ధిని నిర్ణయిస్తాయని భావించిన అంబేద్కర్ స్త్రీలకు రాజ్యంగ రక్షణలతో పాటు, సామాజిక జీవితంలో అనేక విచక్షలను అంతం చేయడానికి హిందూకోడ్ బిల్లును, చట్టాలను రూపొందించాడు.
స్వతంత్ర పాలన డెబ్బై ఏండ్లు దాటిన మహిళా ప్రగతి సూచికలో భారత్ మందగమనంలో ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసి లింగ వివక్ష సూచిక – 2023 తెలియచేసింది. – అస్నాల శ్రీనివాస్
స్వతంత్ర పాలన డెబ్బై ఏండ్లు దాటిన మహిళా ప్రగతి సూచికలో భారత్ మందగమనంలో ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసి లింగ వివక్ష సూచిక – 2023 తెలియచేసింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రాజకీయ సాధికారతలో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు ఏ మేరకు అవకాశాలను పొందుతున్నారో అలాగే స్త్రీలకు లభించే భద్రత, గౌరవం ఆధారంగా ఈ సూచికను రూపొందిస్తారు. 149 దేశాల జాబితలో భారత్ 108వ స్థానం పొందినది. దీని అనుబంధంగా ఉన్న ఆర్థిక ఆవకాశాల ఉపసూచికలో 142వ .విద్యవికాసాలలో 114వ, ఆరోగ్యరక్షణలో 147వ స్థానాలను పొందినది. ఈ ప్రామాణిక కొలమానాలు మహిళా స్థితి గతులు భారత్‌లో ప్రమాదకరస్థాయికి చేరుకున్నట్లు తెలియచేస్తున్నాయి.
పదహారవ లోక్ సభలో 543 సభ్యులకు కేవలం 66 మంది స్త్రీలు అనగా 12.5% మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో 250 సభ్యులకు 30 మంది స్త్రీలు అనగా 12.4% ఉన్నారు. – అస్నాల శ్రీనివాస్
భారత్‌లో రాజకీయ సాధికారతలో మహిళలు వెనుకబాటుతనంలో ఉన్నారు. పదహారవ లోక్ సభలో 543 సభ్యులకు కేవలం 66 మంది స్త్రీలు అనగా 12.5% మాత్రమే ఉన్నారు. రాజ్యసభలో 250 సభ్యులకు 30 మంది స్త్రీలు అనగా 12.4% ఉన్నారు. కేంద్ర మంత్రి వర్గంలోని 64 మంత్రులలో 8 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘర్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో 678 శాసనసభ సభ్యులలో 62 మంది స్త్రీలు ఉన్నారు. ఈ ఐదు రాష్ట్రాలలో 93 మిలియన్ల మహిళ ఓటర్లు చురుకుగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. మిజోరంలో ఒక మహిళ ఎం.ఎల్.ఎ. లేరు. తెలంగాణలో తొమ్మిది ఎం.ఎల్.ఏ లు ఉన్నారు. సుదీర్ఘ పోరాటాల కారణంగా చట్ట సభలలో 33% మహిళ రిజర్వేషన్ల చట్టం రూపుదిద్దుకున్న సామాజిక భాగస్వామ్యం లేదు,తక్షణ అమలుకు నోచుకోవడం లేదు.
భారత్ శ్రామికశక్తిలో దశాబ్దాలుగా ఉన్న 42% వాటా ప్రస్తుతం 24%నికి పడిపోయింది. వ్యవసాయ, పాడి, పశుసంపద వంటి రంగాలలో కీలకపాత్ర పోషించిన స్త్రీలు క్రమేణా ఈ రంగానికి దూరమవుతున్న దోరణులు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ వ్యవసాయ, దాని అనుబంధరంగాలలో స్త్రీల ప్రాధాన్యతను తెలియచేసే ”ఉమెన్ ఫీడ్స్ వరల్డ్, ఉమెన్ ఫస్ట్ ప్రాస్పర్టి ఫర్ ఆల్” అనే నినాదాల ప్రచారం నిర్వహిస్తున్నది. స్త్రీలు వ్యవసాయ రంగంలో చురుకుగా పాల్గోన్నప్పుడే స్థానిక వనరుల రక్షణ, జీవవైవిధ్య పంటలను కాపాడుతారు అని సంస్థ తెలియచేసింది. జిడిపిలో స్త్రీల వాటా 7% ఉంది. ఇది చైనాలో 41% ఉంది. స్త్రీలు అందరు ఉత్పాదకరంగాలలో పాల్గొంటే జిడిపి 2025 నాటికే 60% పెరుగుతుందని మెకిన్సి అనే ఆర్థిక సంస్థ పేర్కొంది. వేతనాలలో వ్యత్యాసం, నైపుణ్యాలు కొరవడటం, పితృస్వామిక భావజాలం కారణంగా స్త్రీ శామికశక్తి తగ్గిపోతున్నది.
దేశంలో స్త్రీల ఆరోగ్య స్థాయి ప్రపంచంలోని దారిద్య్ర దేశాల జాబితాలో 3వ స్థానం పొందింది. జిడిపి లో కేవలం ఒక శాతం మాత్రమే ఆరోగ్యం పై వెచ్చించడం దీనికి ప్రధాన కారణం. ఫలితంగా ప్రజారోగ్య వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నది. వ్యాధి వ్యాపారంగా మారిన నేపద్యంలో స్త్రీలు ఏ చిన్న రుగ్మతతో ప్రవేటు దవఖానాలో చేరిన కనీస ఇరవై వేలరూపాయలను వెచ్చిస్తున్నారని నేషనల్ స్టాటస్టికల్ శాంపుల్ సర్వే తెలియచేస్తున్నది. దేశంలో 17.3% స్త్రీలు మాత్రమే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదిస్తున్నారని 17.9% ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో మాత్రమే మహిళా డాక్టర్లను కలిగి ఉన్నాయని తెలియచేసింది. ప్రసూతి మరణాల రేటు 167కి చేరుకుంది. 70కి చేర్చాలన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి ఇంకా చాలా దూరంలో ఉంది. లైంగిక ప్రత్యుత్పతి ఆనారోగ్యం దళిత, ఆదివాసి, గ్రామీణ స్త్రీలలో తీవ్రంగా ఉంది.
1941లో 7.3% ఉన్న స్త్రీ అక్షరాస్యత 2011లో 65.46%కి చేరింది. ఇది పురుషులలో 82.14% గా ఉంది. – అస్నాల శ్రీనివాస్
స్త్రీల విద్యావకాశాలకు, సామాజిక న్యాయం, సామాజిక పరివర్తనకు సహ సంబంధం ఉంది. స్త్రీ విద్య వారి హక్కుల పట్ల అవగాహనను, అవకాశాలలో ఎంపికను, ఆరోగ్యం, పునరుత్పత్తిల పై స్వయం ఆలోచన ప్రతిపత్తిని కల్గిస్తాయి. 1941లో 7.3% ఉన్న స్త్రీ అక్షరాస్యత 2011లో 65.46%కి చేరింది. ఇది పురుషులలో 82.14% గా ఉంది. పాఠశాల విద్యలో బాలికల నమోదు నిలకడగా ఉన్నా, ఉన్నత విద్యలో స్త్రీల నమోదు 30% ఉంది. గ్రామీణ బడులలో సానిటేషన్ సౌకర్యాలలేమి, రుతుస్రావ ఆరోగ్యం రక్షణ విధానాలు లేకపోవడం, బాల్యవివాహాల వల్ల బాలికలలో బడి మానవేసేవారి సంఖ్య ఎక్కువ అవుతున్నది. ఉన్నత, సాంకేతిక, విద్యా సంస్థలలో ఉద్యోగుల సంఖ్య నామమాత్రంగానే ఉంది.
రాయిటర్ ఫౌండేషన్ నిర్వహించిన స్త్రీల మనుగడ, రక్షణ సర్వేలో అప్ఘనిస్తాన్, కాంగో, పాకిస్తాన్‌ల తర్వత స్థానాన్ని భారత్ పొందింది. దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక స్త్రీ అత్యాచారానికి ,ప్రతి సెకండుకు ఒక స్త్రీ గృహ హింసకు లోనవుతున్నారు. మహిళల అక్రమ రవాణలో, భ్రూణహత్యలకు ప్రపంచంలోనే భారత్ నిలయంగా మారింది. రాజకీయ కక్ష్యలకు పసిబాలికల పై అఘాయిత్యం చేసే అమానవీయ దోరణులు, నిందితులకు మద్దతుగా ఛాందసవాదుల ర్యాలీలు వంటి ఉన్మాదచర్యలు విస్తృతం అవుతున్నాయి. స్త్రీలలో సహజమైన, జీవసంబంధ, పునరుత్పత్తికి తోడ్పడే ఋతుస్రావంను మలినమైనదిగా, పాపమైనదిగా భావించే ఆశాస్త్రీయ దోరణులు కొనసాగుతూ ఆ నెపంతో వారి ఆరాధన స్వేచ్ఛ, దేవాలయాల సందర్శనం పై ఆంక్షలను కొనసాగిస్తున్నారు. ఆరాధన స్వేచ్ఛను అన్ని మతాలలో అమలు చేయాలని భూమాత బ్రిగేడ్ స్థాపించి ఉద్యమాలను నిర్వహిస్తున్న తృప్తిదేశాయ్ పై హాప్పీ టూ బ్లీడ్ ఉద్యమ నేత నిఖిత ఆజాద్ తదితర స్త్రీ వాద ఉద్యమకారుల పై మోడి సంఘ పరివార్ శక్తులు దాడిచేస్తున్నాయి. వివాహస్వేచ్ఛను ఆచరిస్తున్న యువతపై పరువు హత్యలు కొనసాగుతున్నాయి. ఈ రకంగా స్త్రీల మీద జరుగుతున్న ఆకృత్యాలు సమాజంలోని అమానుషత్వాన్ని తెలియచేయడమే కాకుండా వారి చైతన్యాన్ని రాజ్యం, సమాజం అంగీకరించడంలేదని తేటతెల్లం చేస్తుంది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని మహిళా సాధికారతకు రూపునివ్వడానికి కార్యక్రమాలు చేపట్టాలి.నైపుణ్యాలు గల మహిళలకు నియామాకాల్లో ప్రాధాన్యత ను ఇచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి.STEM కోర్సులలో ,నిర్ణయాలు తీసుకునే స్థానాలలో ,వ్యాపారం,నాయకత్వ స్థానాలలో ప్రోత్సహించాలి.ఆహార భద్రత,సుస్థిర వ్యవసాయం,సృజనాత్మక,కళాత్మక అంశాలలో భాగస్వామ్యాన్ని పెంచాలి.
స్వాతంత్య్రానికి పూర్వం తర్వాత కొనసాగిన అనేక మానవహక్కుల ఉద్యమాలవల్ల స్త్రీలు సాధించుకున్న హక్కులను హరించివేసే దోరణులు ప్రస్తుతం దేశంలో రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి ప్రతికూలస్థితుల మధ్య గౌరవప్రదమైన జీవితం మా హక్కు అని, మహిళలు లేనిది చరిత్ర లేదని, పురుషుల కంటే ఏ విషయములో తీసిపోమనే విషయాన్ని రుజువు చేసుకుంటూనే ఉన్నారు. తమ జీవితాలను విధ్వంసం చేస్తున్న ప్రపంచీకరణ, ఛాందస పునరుద్ధరణ దోరణులకు వ్యతిరేకంగా, ఆధిపత్యం లేని హింసారహిత, పరస్పరత, సమత్వంల ప్రాతిపదిక భారత సమాజ పునర్నిర్మాణం కోసం ఉద్యమాలను నిర్వహిస్తూ, పాలకవర్గాలను కదిలిస్తున్నారు.బాల్యం నుండే సమానత్వ భావనను కుటుంబంలో ,విద్యలో భోధనాంశంగా చేర్చాలని పౌరసమాజం కోరుతుంది . ప్రజాతంత్ర ఉద్యమాలు, పాలకుల రాజకీయ ధృఢసంకల్పంతోనే లింగ వివక్షతకు తావు లేకుండా సామాజిక, ఆర్థిక, విద్య, పరిపాలన, న్యాయ రంగాలలో అభివృద్ధి ఫలాలు అందరికి అందే సంతులిత నవభారతం ఆవిష్కృతం అవుతుంది.
వ్యాస రచయిత
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం