BIKKI NEWS (MARCH 07) : Womens day 2025 special essay by Addagudi Umadevi. కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక 108 సంవత్సరాల చరిత్ర ఉంది. మానవ మనుగడకు మూలం స్త్రీ శక్తి , మహిళల సాధికారతకు గుర్తుగా, మహిళలు ఎదుర్కొనే సమస్యల ఫలితంగా, వివక్షతకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమం నుండి పుట్టిందే మహిళా దినోత్సవం.
Womens day 2025 special essay by Addagudi Umadevi.
1908 లో మెరుగైన జీవితం, తక్కువ పనిగంటలు, పురుషులతో సమానమైన వేతనం, ఓటు హక్కులను కోరుతూ న్యూయార్క్ లో ప్రదర్శనలు నిర్వహించగా ఆ ప్రదర్శనల ఫలితంగా మొదట 1908లో జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడింది. 1910 ప్రతీ సంవత్సరం ఏదో ఒకరోజు అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం జరుపుకోవాలని సూచించిన మహిళ – క్లారా జెట్కిస్. 1910 కోపెన్ హగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో ఆమె ప్రతిపాదన చేయగా దానిని 100 మంది పలు దేశాలకు చెందిన మహిళలు ఏకగ్రీవంగా అంగీకరించారు. దాని ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆనాడు జరిపినారు.
1913 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించగా కొన్ని దేశాల్లో యాంటి సెక్సిజం డే గా, ఇంకొన్ని దేశాల్లో వివక్ష వ్యతిరేక దినోత్సవంగా ఇంకొన్ని దేశాల్లో సివిల్ అవేర్ నెస్ డే గా మహిళల హక్కులకై సమ్మె ప్రారంభించిన రోజును పిలుస్తున్నారు.
1917లో రష్యా మహిళలు ఆహారం – శాంతి నినాదం చేస్తూ సమ్మె ప్రారంభించారు. రష్యా వారు అనుసరించే జూలియస్ క్యాలెండర్ ప్రకారం సమ్మె ప్రారంభించిన రోజు ఫిబ్రవరి -23 (ఆదివారం) ఇప్పుడు అమలులో ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8 వ తారీఖు.
సమ్మెలు పోరాటాల ఫలితంగా 1975 సం॥ లో ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం ఒక ప్రధాన ఇతివృత్తాన్ని ఎంచుకోవాలని ఆదిశగా అభివృద్ధి సాధించాలని నిర్ణయించి 1975 సంవత్సరాన్ని “గతాన్ని వేడుక చేసుకోవడం భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం” అనే ఇతివృత్తంతో మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది.
కాగా 2025 సంవత్సరానికి ” చర్యను వేగవంతం చేయండి ” అను ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు.
2011 మార్చి 8 న శతాబ్ది వేడుకలు జరుగగా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి నెలను “మహిళల చరిత్ర “నెలగా ప్రకటించారు. మరి శతాబ్ది ఉత్సవాలు జరిగినా పూర్తిగా లింగ సమానత్వం సాధించలేదు
మహిళలు వ్యాపారం, రాజకీయం వంటి రంగాలలో ఇప్పటికీ మహిళలు సమాన స్థాయిలో లేరు. రోజు రోజుకీ మహిళల పట్ల అత్యాచారాలు, హింస, వేదింపులు పెరుగుతూనే ఉన్నాయి. మహిళలకు రక్షణ చట్టాలైన 1948 కనీస వేతన చట్టం, 1961వరకట్న నిషేధ చట్టం, 1976 సమాన వేతన చట్టం, 2005 గృహహింస నిరోధ చట్టం, 2013 నిర్భయ చట్టం ఇలా ఎన్నో చట్టాలు హక్కులు ఉన్నా మహిళలు మతం, ఆచారం, సంస్కృతి, వరకట్నం సమస్యల పేరిట హత్యలకీ లైంగిక అత్యాచారానికీ ఆహుతైపోతూనేవున్నారు.
“నస్త్రీస్వాతంత్ర్యమర్హతి” అన్నమాటకు స్వస్తిపలికి
“యత్రనార్యంతి పూజ్యంతే తత్రరమంతి దేవతా” అన్న మాటలు నిజమవ్వాలంటే స్త్రీకి గుర్తింపు ముందుగా ఇంటిలోనుండే మొదలవ్వాలి. బయట అందలాలెక్కినా ఇంట్లో ఆదరింపు గుర్తింపు లేక ఎందరో మహిళలు వేదనకు గురియవుతుంటే కాలు బయటపెట్టిన మగువపై కామాంధులు డేగకన్నేస్తుంటే నరమృగాలకోరల్లో చిక్కుకొని కాలం కాటుకు బలియయ్యే అబలలు ఎందరో.
మహిళా దినోత్సవం వేళ మాత్రమే మహిళలకు పెద్దపీటవేసి అందలానెక్కించే నేటి సమాజ ఆలోచనా విధానంలో మార్పురావాలి. “మాతృవత్ పరదారేషు” “అన్నది నిజమై ఆంక్షల సంకెళ్ళు త్రెంచబడితే సాగిపోయే మహిళకు” ఆకాశమే హద్దు”.
అపురూపం
నలిపే పాదాలకు పద్మపీఠం
సహనంలో భూదేవియై...
ఊపిరిపోసే అపర బ్రహ్మ ఉసురు తీసినా ఊతమై...
మనోసాగరంలో సుడిగుండాలున్నా చిరుజల్లులు కురిపించును పయోధరమై...
అంతరంగంలో బడబానలం మోస్తూ పూర్ణాహుతికి సమిధయై...
అనంత నిర్మలాకాశంలో శూన్యమే తన చిరునామా...
నిఘంటువులో లేని అనిర్వచనీయ అపురూప బహుమతి...
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
వరంగల్ – 9908057980
- SCERT RIMC డెహ్రాడూన్ లో 8వ తరగతి అడ్మిషన్స్ 2026
- TGPSC GROUP 3 RESULTS – గ్రూప్ 3 ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Mega star Chiranjeevi – చిరంజీవికి యూకే పార్లమెంట్ పురష్కారం
- TODAY GOLD RATE – భారీగా పెరిగిన బంగారం, వెండి ధర
- CURRENT AFFAIRS IN TELUGU 12th MARCH 2025 – కరెంట్ అఫైర్స్