కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వెయిటేజీ

వైద్యారోగ్యశాఖ నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు.

వివిధ విభా గాల్లో 10,028 ఖాళీలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీచేస్తారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు వంటి స్పెషలిస్టు వైద్యులు.. ఎంబీబీఎస్‌ అర్హతతో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ట్యూటర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంపీహెచ్‌ఏ (స్త్రీ)/ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేస్తారు.

స్పెషలిస్ట్‌ వైద్యులను పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌/సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివినవారికి గ్రేడ్లు, మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని అనుసరిస్తారు. గ్రేడ్‌ ఏలో 60%, ఆపై మార్కులుంటే ఎక్సలెన్స్‌.. బీగ్రేడ్‌లో 55%, ఆపై ఉంటే ‘గుడ్‌’.. 50%, అంతకంటే తక్కువ ఉంటే పాస్‌ గ్రేడ్‌గా నిర్ధారిస్తారు.

►సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంఓ ఎస్‌ తదితర పోస్టులకు ఎంబీబీఎస్‌లో పొందిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాల్లో పొందిన మొత్తం మార్కులను కలిపి 80%కి మార్చుతారు.

►విదేశాల్లో మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చేసినవారికి సంబంధించి.. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్వహించే ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఎంజీఈ)లో పొందిన మార్కుల ఆధారంగా 80వరకు పాయింట్లను నిర్ధారిస్తారు.

►స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలకు రాతపరీక్షలో పొందిన మార్కులకు 80 పాయింట్లు ఇస్తారు.

►అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, ట్యూటర్లు, జీడీఎంఓఎస్, ఆయుష్‌ వైద్యాధికారులు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ (స్త్రీ), ల్యాబ్‌–టెక్నీషియన్‌ గ్రేడ్‌– ఐఐ, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌– ఐఐ, రేడియోగ్రాఫర్, పారామెడికల్‌ ఆప్తాల్మి క్‌ ఆఫీసర్, ఫిజియో థెరపిస్ట్‌ పోస్టులన్నింటిలో.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ అభ్యర్థులకు 20 పాయింట్ల వరకు వెయిటేజీ ఇస్తారు.

►అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న నిర్దిష్ట కేటగిరీలో అన్ని పోస్టులకు ప్రాధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది.

ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ధ్రువీకరణ తీసుకుని..

వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ అనుభవమున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అధికారులు ఈ దరఖాస్తులను 15 రోజుల్లోగా ఆమోదించి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి లేదా తిరస్కరించాలి. అభ్యర్థులు ఈ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

★ ప్రతి ఆరునెలల అనుభవానికి..

ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరునెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. ఏ సేవ అందిస్తే.. అదే కేటగిరీ ఉద్యోగానికి మాత్రమే వెయిటేజీ పాయింట్లు వర్తిస్తాయి.

►కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, హాజరు రిజిస్టర్లు వంటి రికార్డులను సూచించవచ్చు. వాటి కాపీలను జత చేయవచ్చు.

►సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి అనుభవ ధ్రువీకరణను జిల్లా వైద్యాధికారులు ఇవ్వొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసేవారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ధ్రువీకరణ ఇవ్వాలి.

Follow Us @