సమిష్టి సంఘటిత జీవన మధురిమలను పంచిన వన దేవతల దర్శనం

  • GCLA 475 ములుగు సంఘం ఆధ్వర్యంలో వనదేవతల దర్శనం, వన భోజన కార్యక్రమం పై అస్నాల శ్రీనివాస్ చక్కటి విశ్లేషణ

అడవిలో ప్రయాణం అలుపు ఉండదు.. నాగరికత అపశ్రుతులతో అడవి నుండి వియోగం చెందిన.. పాత అనుబంధమేదో డి.యన్.ఏ లో అంతర్గతంగా నిక్షిప్తమై ఉండి.. వనంలోకి ప్రవేశించగానే బహిర్గత లక్షణమైమళ్ళీ తల్లి కడుపులోకి చొచ్చుకపోతున్న సందడి కేరింతలతో సంరంభానికి లోనవుతాము.

ఇంకా జన జాతర మేడారంకు రెండు నెలల సమయం ఉన్నా తల్లులను కంటి నిండా చూడాలని తనవి తీరా తమ పసి తనము తన్మయత్వం తో తల్లుల ఒడిలో కొన్ని క్షణాలైన సేదతీరి ఆశీస్సులను పొందాలని, అమ్మలతో తమ ఆశలు ఆకాంక్షలు వేదనలు తెలియచేయాలని ముచ్చట పెట్టాలని వేలాదిగా ప్రజలు నగరాలు గ్రామాల నుండి వడి వడిగా అప్పటికప్పుడు మొలకలెత్తి విరగపండిన వరి కంకుల వలే దండకారణ్య మేడారం లోయ వైపు వస్తున్న దృశ్యం కనిపించింది. ఒకప్పుడు తెగిన పేగు బంధం కాబోలు మళ్ళీ కలుస్తున్నప్పుడు ఉండే ఆతృత జనం కళ్ళలో కనిపించింది.

కుంకుమ భరిణేలు ఆదివాసీ వీర వనితలు సమ్మక్క సారక్కలు వెలసిన, నడయాడిన తాడ్వాయి మేడారం సన్నిధిలో హరగోపాల్, గణపతి ల సారధ్యంలో ప్రభుత్వ ఒప్పంద అధ్యాపకుల సంఘం 475 ములుగు విభాగం నిర్వహించిన వనదేవతల దర్శనం, వన భోజన కార్యక్రమం ఆద్యంతం భక్తి శ్రద్ధలతో, ధ్యేయము కోసం ఐక్యమయ్యే అధ్యాపకుల పారవశ్యం సందడితో కొనసాగింది.

ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు అంతా దారి వెంట వెలిసిన వివిధ రూపాల గట్టమ్మ తల్లుల వద్ద తమ భక్తిని కోరికలను నింపుకున్న కొబ్బరి కాయలను కొట్టి దర్శనం చేసుకుంటూ తాడ్వాయి మీదుగా మేడారం చేరుకున్నాము.
అంతరిస్తున్న అడవి చిగురిస్తున్నట్లు గోచరించింది.
సమ్మక్క సారక్క లు సవారీ చేసిన పులుల సంతానం మళ్ళీ ఈ మధ్య తాడ్వాయి అరణ్యానికి చేరుకున్నట్లు వాటి అడుగుజాడలు తెలియచేస్తున్నాయి. అందరం కరువు కాలంలో కప్పం కట్టంపో అని ధిక్కరించి పోరాడి అమరులైన జంపన్న పడిగిదిద్దరాజు, సమ్మక్క సారక్క ల రక్తంతో తడిసిన సంపగి వాగు ధూళిని నుదిటి పూసుకుని తల్లులు అదృశ్యం అయిన చిలకల గుట్టకు తలలు వంచి నమస్కరించి తల్లుల గద్దెల చెంత చేరుకున్నాము. మొక్కులు చెల్లించుకున్నాము.

వెదురు పూల వనంలో ములుగు జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకుడు 475 అధ్యాపక సంఘ నేత హరగోపాల్ 150 మందికి చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు. గణపతి, రాజిరెడ్డి, చరణ్, అశోక్, విజయమోహన్ ల బృందం తమ ఆత్మీయతను ఓంపి చేసిన వంటకాల పరిమళం అడవి అంతా గుప్పుమంది. నడిచి అలసి పోయిన అందరం అపురూపమైన విందును ఆరగించాము.

తర్వాత జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన తాడ్వాయి కళాశాల ప్రిన్సిపాల్ ఇంటర్ విద్య గెజిటెడ్ అధికారుల సంఘ నేత అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ… ఇంటర్ విద్య అడ్మిషన్ ల పెరుగుదల, ఒప్పంద అధ్యాపకుల వేతనాల పెంపు నేపథ్యంలో తల్లులకు కృతజ్ఞతతో ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన 475 సంఘ మిత్రులు అభినందనీయులు తెలిపారు. కొప్పిశెట్టి సురేష్, వస్కుల శ్రీనివాస్ లు నిబద్ధతతో తమ పూర్తి సమయాన్ని సంఘ సభ్యుల శ్రేయస్సు, ఇంటర్ విద్య రక్షణ కోసమే కేటాయిస్తున్నారని వారి నాయకత్వంస్పూర్తి దాయకం అని అన్నారు. అడగడం ఆందోళన చేయడం వంటి గుణాలను మనలో ప్రోది చేసిన తల్లుల వారసత్వాన్ని ప్రజా విద్య వ్యవస్ధ పరిరక్షణలో ఆచరించాలి.

ముఖ్య అతిధి జిల్లా ఇంటర్ అధికారి, టిజిఓ ఇంటర్ విద్య సలహాదారు వెంకన్న మాట్లాడుతూ… ఏజెన్సీ కళాశాలలు తెలంగాణలో ఒక నమూనా కళాశాలలుగా తీర్చిదిద్దాడానికి కృషి చేయాలి. వచ్చే సంవత్సర అడ్మిషన్ ల కోసం ఇప్పుడే విద్యా మేళాలు నిర్వహించాలని అన్నారు.

475 అధ్యాపక సంఘ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వస్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ… వృత్తి నిబద్ధతతో పని చేస్తూ ఒప్పంద అధ్యాపకుల గౌరవ ప్రతిపత్తిని, వేతనాల పెంపులో అలుపెరగని పోరాటం చేసుకొని సాధించాము. ఈ ప్రస్థానంలో తమకు తోడుగా నిలిచిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ అగ్రనేతలు మమత, సత్యనారాయణ, జగన్మోహన్, శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా ఈ సమావేశములో టిజిఓ నాయకులు అశోక్ గారు, మధుకర్ రెడ్డి గారు, అధ్యాపక సంఘ నేతలు రాజేంద్రప్రసాద్, చిడెం రమేష్, గణపతి, హరగోపాల్ తమ ఆత్మీయ సందేశాలను ఇచ్చారు.

చక్కని సమిష్టి భావనలను, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని నింపిన ఈ కార్యక్రమ స్ఫూర్తితో మరింత ఉత్సహంతో ప్రభుత్వ ఇంటర్ విద్య వికాసానికి పని చేయడానికి కార్యోన్ముఖుత వైపు కదిలించింది.

Follow Us @