UNION BUDGET 2023 : నూతన పథకాలు

BIKKI NEWS : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి – 01 – 2023న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 2023 – 24 బడ్జెట్ లో వివిధ నూతన పథకాలను (union-budget-2023-new-government-schemes-list-in-telugu) ప్రవేశపెట్టారు. పోటీ పరీక్షల నేపథ్యంలో నూతన పథకాల గురించి సంక్షిప్తంగా…

ప్రధానమంత్రి ప్రిమిటివ్‌ వల్నరబుల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ : ఆదివాసీ కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ మిషన్‌ కోసం వచ్చే మూడేండ్లకు గానూ కేంద్రం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయనున్నది.

ఫార్మాసూటికల్స్‌లో రిసెర్చ్‌
ఫార్మా రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నది. పలు ఎంపిక చేసిన రంగాల్లో పరిశ్రమల పెట్టుబడులను కూడా ప్రోత్సహించనున్నది.

◆ నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ :
విద్యార్థుల కోసం కేంద్రం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని తీసుకురానున్నది. భూగోళ శాస్త్రం, భాషలు, కళలకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాలను డిజిటల్‌ లైబ్రరీలో పొందుపర్చనున్నది.

◆ రైతుల కోసం భారీ స్థాయి స్టోరేజీ గోడౌన్లు
రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకొనేందుకు దేశవ్యాప్తంగా పలు స్టోరేజీ గోడౌన్లను నెలకొల్పనున్నది. వచ్చే ఐదేండ్లలో మల్టీపర్పస్‌ కోఆపరేటివ్‌ సొసైటీలు, ప్రైమరీ ఫిషరీ సొసైటీస్‌, డెయిరీ కోఆపరేటివ్‌ సొసైటీలను ఏర్పాటు చేయనున్నది.

◆ ఐసీఎంఆర్‌ ల్యాబ్‌లలో రిసెర్చ్‌కు సదుపాయాలు
ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల రిసెర్చ్‌కు వీలుగా ఎంపిక చేసిన ఐసీఎంఆర్‌ ల్యాబ్‌లలో సదుపాయాలు కల్పించనున్నది.

నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ రిజిస్ట్రీ
బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్‌ ఖాతాల వివరాలు సహా బ్యాంకుల లావాదేవీలన్నీ కేంద్రీకృతమయ్యేలా నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ రిజిస్ట్రీని కేంద్రం ఏర్పాటు చేయనున్నది.

నేషనల్‌ డాటా గవర్నెన్స్‌ పాలసీ
స్టార్టప్‌లు వినూత్న ఆవిష్కరణలు చేపట్టేందుకు వీలుగా నేషనల్‌ డాటా గవర్నెన్స్‌ పాలసీని తీసుకురానున్నది.

సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌
మేక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌ ఇండియా అండ్‌ మేక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వర్క్‌ ఫర్‌ ఇండియా నినాదంతో కృత్రిమ మేధ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రముఖ విద్యాసంస్థల్లో వీటిని కేంద్రం ఏర్పాటు చేస్తుంది.

సికిల్‌-సెల్‌ అనీమియా మిషన్‌
2047 నాటికి గిరిజన ప్రాంతాల్లోని ఎస్టీల్లో రక్తహీనతను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ మిషన్‌ను ప్రారంభించనున్నది. ఇందులో 40 ఏండ్ల వయస్కులైన 7 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయనున్నది.

47 లక్షల మంది యువతకు స్టైపెండ్‌
నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ స్కీంలో భాగంగా వచ్చే మూడేండ్లలో 47 లక్షల మంది యువతకు స్టైపెండ్‌ అందించనున్నది.

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ -వృద్ధులకు సేవింగ్స్‌
మహిళల కోసం ప్రత్యేకంగా కొత్త పథకాన్ని కేంద్రం బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో డిపాజిట్‌పై 7.5 శాతం స్థిర వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా రెండేండ్ల వరకు ఈ పథకంలో డిపాజిట్‌ చేయవచ్చు. వృద్ధులకు సేవింగ్స్‌ స్కీం కింద రూ.15 లక్షలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని రూ.30 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

30 స్కిల్‌ డెవలప్‌ సెంటర్ల ఏర్పాటు
వచ్చే మూడేండ్లలో యువతలో నైపుణ్యాలను పెంచేందుకు పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన 4.0ను తీసుకొచ్చింది. ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ భాగస్వామ్యం ఉండనున్నది. ఏఐ, రోబోటిక్స్‌, మెకాట్రానిక్స్‌, ఐవోటీ, 3డీ ప్రింటింగ్‌, డ్రోన్స్‌ రంగాల్లో శిక్షణ అందిస్తారు. దానికోసం 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది.

అగ్రికల్చర్‌ యాక్సిలరేటెడ్‌ ఫండ్‌ రూరల్‌ స్టార్టప్స్‌ కోసం ఫండింగ్‌
గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్‌ యాక్సిలరేటెడ్‌ ఫండ్‌ను తీసుకొస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది.

◆ భారత్‌ శ్రీ
ఒక లక్ష శాసనాలను డిజిటల్‌గా భద్రపరిచేందుకు వీలుగా భారత్‌ షేర్‌డ్‌ రిపాజిటరీ ఆఫ్‌ ఇన్‌స్క్రిప్షన్స్‌ (భారత్‌ శ్రీ) పేరుతో డిజిటల్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నది.

నిరుపేద ఖైదీల బెయిల్‌ కోసం ఆర్థిక సాయం
బెయిల్‌ తీసుకొనేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

5జీ టెక్నాలజీ ప్రయోగాలకు 100 ల్యాబ్‌లు
5జీ సర్వీసులు ఉపయోగించి అప్లికేషన్లు అభివృద్ధి చేసేందుకు వీలుగా ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 100 ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నది. స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌, ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్స్‌ తదితర అప్లికేషన్ల అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తుంది. ప్రముఖ విద్యాసంస్థల్లో 3 ఏఐ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నది.

ల్యాబ్‌లో వజ్రాల తయారీ
వజ్రాలకు డిమాండ్‌ నేపథ్యంలో ల్యాబ్‌లో అభివృద్ధి చేసే వజ్రాల తయారీకి కేంద్రం మొగ్గు చూపుతున్నది. ఈ రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్టు బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.

అడ్రస్‌ మార్పు కోసం డిజిలాకర్‌
గుర్తింపు, చిరునామా మార్పుల సమస్యలకు చెక్‌ పెట్టేలా వన్‌ స్టాప్‌ సొల్యుషన్‌గా ప్రభుత్వ ఏజెన్సీలను డిజిలాకర్‌ కిందికి తీసుకురానున్నది. దీనికోసం ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపుగా వర్తింపజేయనున్నది.

మిషన్‌ హోల్‌
అన్ని నగరాలు, పట్టణాల్లో 100 శాతం మ్యాన్‌ హోల్స్‌ను మిషన్‌ హోల్స్‌గా మార్చాలని నిర్ణయించింది.

పీఎం మత్స్య సంపద యోజన
మత్య్సకారులు, అమ్మకందారులు, సూక్ష్మ, చిన్న స్థాయి పరిశ్రమల ప్రోత్సాహానికి కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీని కోసం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది.

పీఎం విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌ (పీఎం వికాస్‌)
దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ వర్గానికి మద్దతుగా నిలిచేందుకు కేంద్రం పీఎం విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌ పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ పథకంలో భాగంగా విశ్వకర్మ కళాకారులకు నైపుణ్య శిక్షణ, టెక్నాలజీ సాయం, ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించనున్నది.

పీఎం ప్రణామ్‌
ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రధాన్‌మంత్రి ప్రమోషన్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ న్యూట్రియెంట్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ యోజన (పీఎం ప్రణామ్‌)ను తీసుకురానున్నది.

గోబర్ధన్‌ స్కీం
రూ.10 వేల కోట్లతో కేంద్రం గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో-ఆగ్రో రిసోర్సెస్‌ ధన్‌ (గోబర్ధన్‌) పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ పథకం కింద 500 కొత్త వేస్ట్‌ టు వెల్త్‌ ప్లాంట్స్‌ను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా పశు వ్యర్థాలను కంపోస్ట్‌, బయోగ్యాస్‌, బయో-సీఎన్‌జీగా మార్చనున్నది.

అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్స్‌
ప్రాంతీయ విమానయానాన్ని అభివృద్ధి చేసేందుకు 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌లు, వాటర్‌ ఏరో డ్రోన్స్‌, అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్లను ఏర్పాటు చేయనున్నది. దేశంలో 50 కొత్త విమానాశ్రయాలను నిర్మించనున్నారు.

అమృత్‌ ధరోహర్‌ స్కీం
జీవవైవిధ్యాన్ని పెంచేలా చిత్తడి నేలల వినియోగం కోసం అమృత్‌ ధరోహర్‌ పథకాన్ని కేంద్రం తీసుకురానున్నది. దీన్ని వచ్చే మూడేండ్లలో అమలు చేయనున్నది.

ఆత్మనిర్భర్‌ క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రాం
హార్టికల్చర్‌ పంటలకు నాణ్యమైన మెటీరియల్‌ అందజేసేందుకు వీలుగా కేంద్రం ఆత్మనిర్భర్‌ క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రాంను తీసుకురాబోతున్నది. దానికోసం రూ.2,200 కోట్లు కేటాయించింది.

10 వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ సెంటర్లు
కోటి మంది రైతులతో సేంద్రియ వ్యవసాయం చేయించేలా దేశవ్యాప్తంగా 10 వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ సెంటర్లను కేంద్రం నెలకొల్పనున్నది.