హైదరాబాద్ (డిసెంబర్ – 29) : నాగార్జున విశ్వవిద్యాలయం యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా తన పరిధిని దాటి తెలంగాణలో స్టడీ కేంద్రాలు ఏర్పాటు చేసిందని, దానివల్ల 2013 సెప్టెంబరు తర్వాత ఆ కేంద్రాల్లో చదివిన విద్యార్థులు ఉద్యోగాలకు అర్హత ఉండదంటూ టీఎస్‌పీఎస్‌సీ వారి దరఖాస్తులు స్వీకరించడం లేదు.
దీంతో తెలంగాణలో నెలకొల్పిన స్టడీ సెంటర్లలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు జూనియర్ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. . దీంతో ఆందోళనకు గురైన అభ్యర్థులు పదుల సంఖ్యలో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలికి వచ్చి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రిని ప్రశ్నించారు. తాము రాష్ట్రంలోనే చదివామని, పదో షెడ్యూల్ ప్రకారం 2014 వరకు స్టడీ సెంటర్లు ఇక్కడ కూడా ఉండొచ్చు కదా? అంటూ తమ దరఖాస్తులను ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించారు.
వర్సిటీ పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో స్టడీ సెంటర్లు పెట్టుకోరాదని, ఒకవేళ వాటిల్లో చదివితే ఆ డిగ్రీకి గుర్తింపు ఉండదని యూజీసీ 2013 లోనే స్పష్టంచేసిందని, తాము కూడా పలుమార్లు మీడియా ద్వారా చెప్పినా విద్యార్థులు అవగాహన లోపంతో వాటిలో చేరారని ఛైర్మన్ వివరించారు. ఇలాంటివారు పెద్దసంఖ్యలో ఉన్నందున యూజీసీకి లేఖ రాసి పరిస్థితిని వివరిస్తామని చెప్పి ఆయన అభ్యర్థులను సముదాయించారు. రాష్ట్రంలో 2013 సెప్టెంబరు తర్వాత నాగార్జున వర్సిటీ స్టడీ కేంద్రాల్లో చదివిన వారు కనీసం లక్షన్నర మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.