GROUP 1 :రద్దుపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్ (సెప్టెంబర్ – 26) : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ TSPSC హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించింది. జస్టిస్ అభినందక్ కమార్ షావిలి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం ఈ అప్పీల్ పై వాదనలను ఈరోజు విననుంది.

ముగ్గురు అభ్యర్థులు తప్ప ఎవరూ ప్రిలిమ్స్ రద్దు కోరలేదని, వీరికోసం లక్షలమందిని ఇబ్బంది పెట్టడం సముచితం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీహరిందర్ పరిషద్ పేర్కొన్నారు.

★ TSPSC పిటిషన్ లోని అంశాలు

  • ఈ కేసులో సింగిల్ జడ్జి తీర్పు చట్టసమర్థనీయం కాదు.
  • రిట్ పిటిషన్ అస్పష్టమైన ఆరోపణలతో దాఖలు చేశారు. వారు దాఖలు చేసిన మేరకు మెటీరియల్ కూడా రుజువు కాలేదు.
  • పరీక్ష తదుపరి ప్రక్రియ నిలిపివేసే ఉద్దేశంతోనే పిటిషన్ వేసిన విషయాన్ని జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు.
  • బయోమెట్రిక్ నిర్వహించలేదని పరీక్ష రద్దు చేయడం చట్టవిరుద్ధం.
  • కేవలం ముగ్గురి ఆరోపణలతో 2,33,506 మంది రాసిన పరీక్షను రద్దు చేయడం వారి భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మారుస్తుంది.
  • టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది.
  • టీఎస్పీఎస్సీకి పరీక్షల నిర్వహణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, అధికారం ఉంది.
  • బయోమెట్రిక్ తీసుకోవడంలో ఇబ్బందులతో కమిషన్ దాన్ని తీసుకోలేదు.
  • అందుకే ఇతర తనిఖీలను క్షుణ్ణంగా చేపట్టింది.
  • నోటిఫికేషన్ లో బయోమెట్రిక్ అని చెప్పి పరీక్ష సమయంలో తీసుకోలేదు అన్న ఆరోపణల సరికాదు.
  • కొందరికి బయోమెట్రిక్ తీసుకొని..మరికొందరికి తీసుకోకపోతే దానిని తప్పుబట్టడంలో అర్థం ఉంది.
  • కానీ,ఇక్కడ అభ్యర్థులందరికీ కమిషన్ ఒకేలా వ్యవహరించింది.
  • పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విషయంలో చిన్నచిన్న ఆరోపణల్లో జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు గతంలోనే సూచించింది.
  • నోటిఫికేషన్ లో మార్పుచేర్పులకు అన్ని అధికారాలు ఉన్నాయని నోటిఫికేషన్ రోజునే కమిషన్ పేర్కొంది.
  • ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. వీరంతా మెయిన్స్ పరీక్ష మ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించకుండా ఎవరూ ఉద్యోగం చేపట్టలేరు.
  • ముగ్గురి కోసం మిగతా 2,33,503 మంది గొంతు నొక్కడం చట్టవిరుద్ధం.
  • గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల, తదుపరి ప్రక్రియకు అనుమతించాలి.

★ సింగిల్ జడ్జి తీర్పు

జూన్ 11న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సిం గిల్ జడ్జి రద్దు చేసిన విషయం తెలిసిందే. బయోమెట్రిక్ తీసుకోకపోవడం, ఫొటో లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యలో పరస్పర విరుద్ధ వివరాలు వెల్లడించడాన్ని తప్పుబట్టింది. టీఎస్పీఎస్సీ లోపాల కారణంగా ఒక్క మెరిట్ అభ్యర్థి అర్హత కోల్పోయినా,Vఅది న్యాయసమ్మతం, సమర్థనీయం కాదంటూ గ్రూప్-1 ప్రిలిమ్స్ ను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్లీ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్పీఎస్సీని ఆదేశించిన విషయం విదితమే.