రెండు జూనియర్ కళాశాలకు అనుమతులు రద్దు.

హైదరాబాద్ నగరంలోని ఇంటర్‌ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన రెండు కాలేజీల గుర్తింపును హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి (DIEO ) జయప్రదాబాయి నిలిపివేశారు. ఇంటర్‌ విద్యార్థులు ఈ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించారు.

వివరాల్లోకి వెళితే.. కోడ్‌ నంబర్‌ – 60352 KMR జూనియర్‌ కళాశాల వెంగళ్‌రావు నగర్‌ మరియు టోలీచౌకిలోని కోడ్‌ నంబర్‌ 60237 న్యూ మదీనా జూనియర్‌ కళాశాలల గుర్తింపును నిలిపివేశారు.

గత ఇంటర్‌ పరీక్షలప్పుడు ఈ కాలేజీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా, విద్యార్థుల ఒక్కొక్కరి నుంచి రూ. 8- 10 వేల వరకు వసూలుచేసి, కాపీయింగ్‌ను ప్రోత్సహించారు. ఇంటర్‌ అధికారులు దాడులు చేయగా ఐదుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికారు. దీనిపై విచారణ చేయగా కాలేజీ యాజమాన్యం డబ్బులు తీసుకున్నట్లుగా తేలడంతో.. ఆ కాలేజీ గుర్తింపును నిలిపివేశారు.

టోలీచౌకిలోని కోడ్‌ నంబర్‌ 60237 న్యూ మదీనా జూనియర్‌ కాలేజీ యాజమాన్యం సైతం ఇదే తరహాలో అక్రమాలను ప్రోత్సహించింది. 8 మంది విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని, విద్యార్థులకు బదులుగా ఇతరులతో పరీక్ష రాయించడం, ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు సహకరించడంతో అధికారులు పట్టుకున్నారు.

ఈ రెండింటిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలను నిలిపివేశామని, విద్యార్థులెవరూ ఆ కాలేజీల్లో చేరవద్దని జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి జయప్రదాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రెండో సంవత్సరం విద్యార్థులు టీసీలు తీసుకుని ఇతర కాలేజీల్లో ప్రవేశాలు పొందాలని సూచించారు.

Follow Us@