TS TET 2023 : రేపే పరీక్ష – ఆభ్యర్ధులకు సూచనలు

హైదరాబాద్(సెప్టెంబర్ – 14) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023 EXAM) రేపు అనగా సెప్టెంబర్ 15న నిర్వహించనున్నారు. ఈమేరకు విద్యాశాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. TS TET HALL TICKETS DOWNLOAD HERE

ఉదయం జరిగే పేపర్-1కు 2,69,557 మంది, మధ్యాహ్నం నిర్వహించే పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేసుకు న్నారు. పేపర్-1కు 1,139, పేపర్-2కు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఒక రోజు ముందే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం ఎక్కడో చూసుకోవాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి అభ్యర్థులకు సూచించారు. రెండు పేపర్లకు కలిపి పరీక్షల విధుల్లో మొత్తం 36,909 మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని వెల్లడించారు. చీఫ్ సూపరింటెండెంట్ గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఉంటాయన్నారు.

పేపర్-1కు బీఈడీ అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశంపై కన్వీనర్ ను వివరణ కోరగా నోటిఫికేషన్ జారీ నాటికి ఉన్న నిబంధనల ప్రకారం తాము బీఈడీ అభ్యర్థులకు కూడా అర్హత కల్పించామని చెప్పారు. టీఆర్డీకి నిబంధనలు వేరుగా ఉంటాయని, దానిపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు.

◆ పరీక్ష కేంద్రాలకు సెలవు

కాగా టెట్ పరీక్షా కేంద్రాలకు ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం ఒక పూట, 15వ తేదీన పూర్తిగా సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కార్యదర్శి
వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

◆ అభ్యర్థులకు సూచనలు:

బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే వినియోగించాలి. దాంతోనే ఓఎంఆర్ గడులను నింపాలి.

ఓఎంఆర్ పత్రంలో బుక్ లెట్ కోడ్ ను తప్పనిసరిగా నింపాలి.

కనీసం గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

హాల్ టికెట్ పై వివరాలు తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో ఇచ్చే సంబంధించిన జిల్లా డీఈవో తో సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.