జనవరి నాలుగు నుండి పాఠశాలలు/కళాశాలల ప్రారంభం – సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లోని పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల తెరవడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్ఫష్టత ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జనవరి నాలుగో తేదీ నుంచే పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. తొలుత 9, 10 తరగతులు, జూనియర్‌ కాలేజీలలో రెగ్యులర్‌ క్లాసులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఆ తరువాత దశల వారీగా 6 నుంచి 8, ఆ తర్వాత ప్రాథమిక తరగతులను రెగ్యులర్‌గా నిర్వహించాలని భావిస్తున్నది. తమ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించామని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం వెల్లడించారు.

ఆన్‌లైన్‌ క్లాసుల పట్ల విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కూల్‌ టీచర్ల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు బడులు తెరవాలని కోరుతూ నతిపత్రాలు ఇచ్చారన్నారు.

★ పరీక్షలకు ఏర్పాట్లు

వార్షిక పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలల కనీసం మూడు నెలలపాటైన తెరువాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది.
కొవిడ్‌-19 నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష పేపర్లను తగ్గించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతో ఈ సారి మార్చికి బదులుగా మే నెలలో నిర్వహించనున్నారు.

★ ఇంటర్మీడియట్‌ పరీక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ రెండో వారంలో నిర్వహించనున్నారు. అంతకుముందుగానే ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి మొదటివారం నుంచి జూనియర్‌ కాలేజీలు ప్రారంభమైతే.. రెగ్యులర్‌ పాఠాలతో పాటు ప్రాక్టికల్స్‌ను కూడా బోధిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సీఎం కార్యాలయానికి పంపారు.

★ త్వరలోనే టీఎస్‌ టెట్‌

ఉపాధ్యాయ నియామకాల కంటే ముందుగానే టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. వీలైనంత త్వరలోనే షెడ్యూల్‌ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన కసరత్తు నడుస్తున్నదని తెలిపారు.

★ విద్యార్థులు పోటీకి సిద్ధంగా ఉండాలి :: సబిత ఇంద్రారెడ్డి

రాష్ట్ర విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడి విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలని, విద్యార్థులను ఆ విధంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కెరీర్‌ మహోత్సవ ఆన్‌లైన్‌ కెరీర్‌ గైడెన్స్‌ కార్యక్రమాన్ని మంత్రి తన కార్యాలయంలో గురువారం ప్రారంభించారు.