పిఆర్సి నివేదికపై మోడల్ స్కూల్ టీచర్ల నుండి నిరసనల వెల్లువ.

తెలంగాణ తొలి పిఆర్సి నివేదికను ఆ కమిటీ అశాస్త్రీయంగా రూపొందించిందని నిరసన వ్యక్తం చేస్తూ ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర సంఘం (PMTA – TS) ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్ లో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అధ్యక్షుడు తరాల జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు.

పిఆర్సి నివేదికలో ప్రకటించిన 7.5 శాతం ఫిట్మెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి, మనోవేదనకు గురి చేసిందని తెలిపారు.

2018 జూన్ లో PRC కమిటీ ఏర్పడినప్పుడు స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల్లో బంగారంలాంటి పీఆర్సీని అందుకోబోతున్నారని ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఎంతో సంతోషంతో 30 నెలలుగా పిఆర్సి నివేదిక కోసం ఎదురు చూస్తే కేవలం 7.5% పిట్మెంట్ ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశకు, మనోవేదనకు గురైనట్లు తెలిపారు.

కావున వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిఆర్సి విషయంలో కలగజేసుకొని తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు మేలు కోరుతూ కనీసం 45 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని ఈ సందర్భంగా తరాల జగదీష్ కోరారు.

అలాగే మోడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని అలాగే ఇంటర్మీడియట్ వరకు బోధిస్తున్న PGT లకు జూనియర్ లెక్చరర్ల స్థాయిలో సమాన వేతనం చెల్లించాలని తరాల జగదీష్ కోరారు.

Follow Us@