Home > EMPLOYEES NEWS > TS PRC – 20 నుంచి 26 వరకు పిఆర్సీపై ఉద్యోగ సంఘాలతో కమిషన్ భేటీ

TS PRC – 20 నుంచి 26 వరకు పిఆర్సీపై ఉద్యోగ సంఘాలతో కమిషన్ భేటీ

BIKKI NEWS (MARCH 19) : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో వేతన సవరణ విషయమై అన్ని శాఖల ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్ లోని బూర్గుల రామకృష్ణారావు భవన్ లోని పీఆర్సీ కమిషన్ కార్యాలయంలో మార్చి 20వ తేదీ నుండి 26వ తేదీ వరకూ ఆరు రోజుల పాటు(TS PRC COMMISSION MEETS EMPLOYEES UNIONS FROM 20 to 26th march) జరపనుంది.

దీనికి సంబంధించి ఆయా సంఘాలకు చైర్మన్ నోట్ పంపించారు. ఏ సంఘం ఏ రోజు, ఏ సమయానికి హాజరవ్వాలనే వివరాల షెడ్యూల్ ను ఆ నోట్లో పేర్కొన్నారు. తొలి దశలో ఆయా ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ చైర్మన్ శివశంకర్, సభ్యులు రామయ్య సమావేశమవుతారు. సంబంధిత సంఘాల నేతలు సమర్పించిన ప్రతిపాదనలు, వాటి అమలులో సాధ్యా సాధ్యాలపై చర్చించనున్నారు.

పీఆర్సీకి సంబంధించి సూచనలు, సలహాలు తదిర వాటి ప్రతిపాదనలు సమర్పించేందుకు ఈ నెల 4వ తేదీ తుది గడువు ముగిసింది. వీటికి సంబంధించి మొత్తంగా 3 వేలకు పైగా సంఘాల నుండి పీఆర్సీ కమిషన్ కు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో కొన్ని సంఘాలతో కమిషన్ భేటీ కానుంది.

వివిధ ఉద్యోగ సంఘాల నుండి ప్రధానంగా కనిష్ట వేతనం 35 వేల రూపాయల నుండి గరిష్టంగా 2,99,100 రూపాయలకు పెంచడంపై ప్రతిపాదనలు అందాయి. అదేవిధంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ పద్దతిని కొనసాగించాలని, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్క్రీమ్ ను ఇప్పుడున్న 6/12/18/24 స్థానాలలో 5/10/15/20-25లుగా ఇవ్వడం, ఇంటి అద్దె భత్యాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 27 శాతంగా, 2 లక్షలకు పై జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్ లో 18.5 శాతంగా 50 వేల కంటే ఎక్కువగా, 2 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన మండల కేంద్రాల్లోనే 14 శాతం, అలాగే మిగిలిన ప్రాంతాల్లో 11.5 శాతం అద్దె చెల్లించాలని సూచించాయి.

కనీస పెన్షన్ మొత్తాన్ని 9,500 రూపాయల నుండి 17,500 రూపాయలకు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ 16 లక్షల రూపాయల నుండి 24 లక్షల రూపాయలకు పెంపు, 15 సంవత్సరాల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ఉద్యోగి కానీ, పెన్షనరు కానీ చనిపోతే ఇప్పుడున్న 30 వేల రూపాయల దహన ఖర్చులను 75 వేల రూపాయలకు పెంపు, హౌస్ బిల్డింగ్ అడ్వాన్సులను ఇప్పుడున్న స్థానాన్ని పెంచి 30, 40, 50 లక్షల రూపాయలు చేయడం, కామన్ క్యాటగిరీ ఉద్యోగుల వేతనానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరిండెంటెండెంట్ స్కేళ్లను ధరల ఆధారంగా పెంచి ఇవ్వడం తదితర అంశాలు ఉన్నాయి.