కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, హక్కుల పై పీఆర్సీలో కీలక సూచనలు

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించే విధానం, వారికి కల్పించాల్సిన హక్కుల విషయంలో సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది.

ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించే విధానానికి స్వస్తి పలకాలని, వయసు, విద్యార్హతల ఆధారంగా వారిని కామన్ టెస్ట్ ద్వారా ప్రభుత్వం నియమించుకోవాలని సూచించారు.

★ పరీక్ష పెట్టి నియమించాలి ::

ఏయే శాఖలలో ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు వీరితో భర్తీ చేయాల్సి ఉంటుందో ఖాళీలు నోటిఫై చేస్తూ, ఆయా విభాగాల వారీగా అభ్యర్థులను తీసుకునే ముందు ప్రభుత్వం కామన్ పరీక్ష నిర్వహించాలని, రాష్ట్ర స్థాయి లో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖాళీల భర్తీ జరగాలని సూచించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాదించిన వారిని 1:3 నిష్పత్తిలో తుది జాబితాలను ఆయా విభాగాలకు పంపి ఎంపికైన వారితో న్యాయబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంది.

★ వేతన సిఫారసులు ::

● గూప్-4 స్థాయిలో 19 వేలు ::

ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్, మాలీ, కామాటి, కుక్, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, డఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.12 వేలు ఉండగా, దాన్ని రూ.19 వేలకు పెంచాలి.

● గూప్-3 స్థాయిలో 22,900 ::

డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూ.స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిల్మ్/ఆడియో విజువల్/డేటా ఎం ట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, లైబ్రేరియన్, మేనేజర్లకు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.15,000లు ఉండగా, దాన్ని రూ.22,900లకు పెంచాలి.

● గూపు-3(ఏ) స్థాయిలో 31,400 ::

సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్ లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ప్రస్తుతం నెలకు రూ.17,500 చెల్లిస్తుండగా, దాన్ని రూ.31,040లకు పెంచాలి. వీరికి భవిష్యత్తులో పే స్కేల్ రివిజన్ జరిగే వరకు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున పెంచాలి.

ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానందున ఇది హోం గార్డులకు కూడా వర్తిస్తుంది.

★ అన్ని సౌకర్యాలు కల్పించాలి ::

ఎర్న్‌డ్ లీవ్స్ (EL) తప్ప రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఇతర వసతులు వర్తిస్తాయి. 6 నెలల ప్రసూతి సెలవు వర్తిసుంది. ఈపీఎఫ్, ఈఎస్‌ఐలు కూడా వర్తింపజేయాలి.

Follow Us@