GURUKULA JOBS : త్వరలో సర్టిఫికెట్ ల పరిశీలన

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆర్ట్, క్రాప్ట్, మ్యూజిక్ టీచర్ మినహా మిగతా అన్ని నోటిఫికేషన్ లకు సంబంధించిన తుది ‘కీ’ లను అందుబాటులో ఉంచారు. న్యాయవివాదాల పరిష్కారం తర్వాత ఆ మూడు పోస్టులకు సంబంధించిన తుది కీ లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులను (1:2 ratio selected list of gurukula jobs) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ (gurukula jobs certificate verification schedule) త్వరలోనే విడుదల చేయనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేవలం హైదరాబాదులోనే జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నియామక బోర్డు భావిస్తోంది. సీబీటీ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసి.. అభ్యర్థులు తమకు నచ్చిన తేదీ, కోరుకున్న సమయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హైదరాబాద్ వచ్చే అవకాశం కల్పించనుంది.

హైదరాబాద్ కేంద్రంగా రోజూ పరిమిత సంఖ్యలో స్లాట్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. త్వరలోనే పీజీ విద్యార్హత కలిగిన డిగ్రీ, జూనియర్ లెక్చరర్, పీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించి.. షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తోంది. ఆ తర్వాత టీజీటీ పోస్టుల షెడ్యూల్ ఉంటుంది.

గురుకుల పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు టీఎస్పీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలుండడంతో వారికి ఇబ్బందులు లేకుండా ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది. అభ్యర్థులు వెబ్సైట్ లాగిన్ ద్వారా ఏ రోజున ఏ సమయంలో పరిశీలనకు హాజరవుతారో ముందుగా స్లాట్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున కచ్చితంగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలతో పరిశీలనకు హాజరుకావాలి.