కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకోవాలి – జగిత్యాల 475 సంఘం

జగిత్యాల :: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం 2016 సంవత్సరములో జారీ చేసిన జీవో నెంబర్ 16 పై ఇంతకాలంగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు రేమిడి మల్లారెడ్డి, చౌడారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు శుక్రవారం రోజున ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం క్రమబద్ధీకరణ జీవో నంబర్ 16కు హైకోర్టులో న్యాయపరమైన సమస్య తలెత్తడంతో క్రమబద్ధీకరణ ఆగిపోయిందని ఇటీవల హైకోర్టు న్యాయపరమైన చిక్కులను తొలగించిందన్నారు. కావున ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభించి రెండు దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో ప్రభుత్వ కళాశాలల పరిపుష్టికి అహర్నిశలు కృషి చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమదోపిడీకి చరమగీతం పాడుతుందని అనేక పర్యాయాలు తెలియపరిచిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాంట్రాక్టు ఉద్యోగులు చాలామంది రిటైర్మెంట్ వయసుకు దగ్గర పడుతున్నారని ఉద్యోగాల చివరి అంకంలోనైనా వారి ముఖాల్లో చిరునవ్వును చూపెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రభుత్వము కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై సత్వరమైన చర్యలు చేపట్టాలని, ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి కాంట్రాక్టు ఉద్యోగులు మరింత ఉత్సాహంగా సేవలు చేసే విధంగా చూడాలని మల్లారెడ్డి, శ్రీనివాస్ కోరారు.

Follow Us @