రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21)లో డిగ్రీ పస్టీయర్ విద్యార్థులకు డిసెంబరు 7వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు మొదలు కానున్నాయి.
వాస్తవానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(DOST) మొదటి విడత సీట్లను సెప్టెంబరు 21న కేటాయించారు. తర్వాత రెండు, మూడో విడత మరియు తాజాగా డిసెంబరు 5న ప్రత్యేక విడత DOST సీట్లను కేటాయించారు.
పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అక్టోబరు నుంచి ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారికంగా డిసెంబరు 7 నుంచి ఆన్లైన్ తరగతులు జరుపుతామని DOST కన్వీనర్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆర్.లింబాద్రి వెల్లడించారు.
తాజాగా సీట్లు పొందిన వారందరూ ప్రవేశాలు పొందితే DOST ద్వారా డిగ్రీలో చేరిన వారి సంఖ్య 2.17 లక్షలు దాటుతుంది. గతేడాది ఆ సంఖ్య 1.80 లక్షలు మాత్రమే.
ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రత్యేక విడత DOST కౌన్సెలింగ్ ద్వారా కొత్తగా 27,365 మందికి డిగ్రీ కళాశాలల్లో సీట్లు లభించాయి.
ఈ ప్రత్యేక విడతలో 14,247 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా సీట్లు పొందనివారు, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోని వారు మరో 13,889 మంది తాజాగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలో 27,365 మందికి సీట్లు లభించాయని, సీట్లు పొందినవారు డిసెంబరు 8వ తేదీలోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి.. కళాశాలల్లో చేరాలని సూచించారు. తగినన్ని ఐచ్ఛికాలు ఇవ్వని కారణంగా 771 మందికి సీట్లు దక్కలేదని లింబాద్రి తెలిపారు.
Follow Us@