బదిలీల పై అధికారుల తీరు విచారకరం – కొప్పిశెట్టి సురేష్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల బదిలీల సమస్యపై సీఎం కేసీఆర్ రాత పూర్వకంగా హామీ ఇచ్చి 60 రోజులు గడుస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు దానిపై స్పందించక పోవడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ లు అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

గత 13 సంవత్సరాలుగా బదిలీలు లేక తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులతో విధులు నిర్వహిస్తున్నారని, జూనియర్ అధ్యాపకుల సమస్యలను గత మూడు సంవత్సరాలుగా వివిధ రకాలుగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన నేపథ్యంలో నవంబర్ 15వ తేదీన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల సమక్షంలో బదిలీలపై సానుకూల ప్రకటన చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రకటన సీఎం కార్యాలయం నుంచి వెలువడి 60 రోజులు గడుస్తున్నా ఇంకా సంబంధిత అధికారులు బదిలీ మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంపై పలుమార్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి, సంబంధిత శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగిందని, అయినప్పటికీ బదిలీ మార్గదర్శకాలు విడుదల కాకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో భౌతిక తరగతులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే బదిలీ మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీలు జరపాలని సంఘం నాయకులు వస్కల శ్రీను, శోభన్ బాబు, సయ్యద్ జబీ ఉల్లా, కురుమూర్తి, గంగాధర్, గోవర్ధన్, సంగీత, శైలజ తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Follow Us@