“సంస్కృతం” పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేదంటే ఉద్యమమే – TIPS

  • ఇది అనాలోచిత తొందరపాటు చర్య తెలుగు భాషకు తీరని నష్టం
  • కార్పొరేట్ దళారుల చేతిలో ఇంటర్ బోర్డు నిర్ణయాలు
  • ఉత్తర్వులురద్దు చేయకుంటే మెరుపు ఉద్యమం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో “సెకండ్ లాంగ్వేజ్” గా సంస్కృతమును తీసుకోవడానికి ఇంటర్మీడియట్ కమీషనర్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని అనాలోచిత నిర్ణయం, తొందరపాటు చర్యగా భావిస్తు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (TIPS) తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సమన్వయ కర్త యం. జంగయ్య, రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ చర్య ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధం. ప్రస్తుతం కార్పొరేట్ జూనియర్ కాలేజీలలో మాత్రమే విద్యార్థులు మార్కులు పెరగటానికి ఒక మార్గంగా సంస్కృతం సబ్జెక్టును “సెకండ్ లాంగ్వేజ్” గా ఎంచుకుంటున్నారని, ఈ నిర్ణయాన్ని బట్టి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో ఉందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్పొరేట్ దళారీలు ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అస్త్రంగా కుట్ర చేస్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులు 1-10 తరగతుల వరకు “తెలుగు భాష”తో చదివి డిగ్రీ మరియు ఆపై చదువులలో ఎలాంటి ప్రాధాన్యత లేకున్నా ఇంటర్మీడియట్ లో మాత్రమే సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం భాషను తీసుకోవడం వలన అటు విద్యార్థులకు గాని, ఇటు సమాజానికి పెద్ద ఉపయోగము లేదని తెలిపారు.

అదేవిధంగా జాతీయ భాషగా హిందీ మరియు ప్రాచీన భాష హోదాకై ప్రయత్నిస్తున్న “తెలుగు భాష” కు తీవ్ర నష్టం జరిగి దీని ప్రభావం సమాజంపై పడే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఇంటర్మీడియట్ కమీషనర్ వారు ప్రభుత్వంతోగాని, ప్రముఖ సాహితివేత్తలతోగాని, విద్యావేత్తలతో గాని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించిన వారితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని, ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడాన్ని అనాలోచిత నిర్ణయం, తొందరపాటు చర్యగా భావించి తక్షణమే అట్టి ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని లేని యెడల మెరుపు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని TIPS సంఘ ప్రతినిధులు తెలిపారు.