ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను తక్షణం భర్తీ చేయాలి – TIPS

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదేశంతో 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ మరియు ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో వెంటనే ఖాళీగా ఉన్న 1700 లకు పైగా జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయవలసిందిగా తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (TIPS) ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యార్థులకు ఉచిత విద్య, పాఠ్యపుస్తకాల పంపిణి మరియు కళాశాలలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడానికి ఆసక్తి చూపుతూ ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో సుమారు 75వేల మంది పైగా విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఇంకా వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందే అవకాశం ఉన్నది.

ఈ సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల్లో సుమారు 1700 పైగా జూనియర్ లెక్చరర్ ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు ఎవ్వరిని నియమించలేదు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం, ఉన్నత ఆశయం నెలవేరాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దృష్ట్యా ఆన్లైన్ ద్వారా విద్యాబోధన సక్రమంగా జరగడానికి
తక్షణంమే అన్ని సబ్జెక్టులకు జూనియర్ లెక్చరర్స్ ను నియమించాలని “తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి” తరపున కోరారు.