పాత గెస్ట్ లెక్చరర్లకే మళ్ళీ అవకాశం ఇస్తూ.. ఉత్తర్వుల విడుదలపై దామెర, దార్ల హర్షం

  • దసరా పండుగ పూట గెస్ట్ లెక్చరర్లకు శుభవార్త తెలిపిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటర్మీడియట్ కమీషనర్ కు కృతజ్ఞతలు
  • గెస్ట్ లెక్చరర్ల సంఘం 2152 రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్

తెలంగాణ రాష్ట్రంలోనున్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత కొన్ని సంవత్సరాల నుండి గెస్ట్ లెక్చరర్లుగా సేవలందిస్తున్న సుమారు 1500 మంది గెస్ట్ లెక్చరర్ల కు వెసులుబాటు కలిగేలా.. 2021-22 విద్యాసంవత్సరంలో ప్రస్తుతానికి అన్ని కళాశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా కొనసాగించి మిగిలిన పోస్టుల్లో కొత్తవారిని తీసుకోవడానికి మార్గదర్శకాలను పొందుపరిచి ఉత్తర్వులను ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం 2152 రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు సమస్త గెస్ట్ లెక్చరర్ల పక్షాన, 2152 సంఘం తరపున హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో గత 20 నెలలుగా ఎలాంటి ఉపాధి, వేతనాలు లేక గెస్ట్ లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు పడటమే గాక.. నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన గెస్ట్ లెక్చరర్ కాసోజు గణేష్ చారి ఆత్మహత్య చేసుకోగా.. మానసిక ఒత్తిడితో మరో గెస్ట్ లెక్చరర్ శ్రీనివాస్ నాయక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ సందర్బంలో గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు మరియు పెండింగ్ వేతనాల సమస్యలను త్వరగా పరిష్కరించాలని 2152 సంఘం తరపున చేసిన తీవ్ర ప్రయత్నాలు.. విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పాత గెస్ట్ లెక్చరర్ల కే న్యాయం జరిగేలా ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నందుకు.. తదనుగుణంగా పాత గెస్ట్ లెక్చరర్ల కుంటుంబాలకు న్యాయం జరిగేలా దసరా పండుగ పూట శుభవార్త అందిస్తూ… అధికారిక ఆదేశాలు జారీకి కృషి చేసిన మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, గెస్ట్ లెక్చరర్ల సమస్యల సాధనలో మాకు తోడ్పాటు ను అందించి.. పలు మార్లు పోరాటం చేసిన TIPS & TIGLA సారథులు ఎం. జంగయ్య, ఎం. రామకృష్ణ గౌడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఇంటర్మీడియట్ విద్యలోని అన్ని సంఘాల నాయకులకు, అధికార, ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Follow Us @