BIKKI NEWS (MAY 04) : TGEJAC announced maha dharna on June 9th 2025. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్స్ ఐక్యకార్యచరణ సమితి సుందరయ్య విజ్ఞాన భవన్ లో, ఈ రోజు సుదీర్ఘ సదస్సు జరిగింది. ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండిగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జరిగిన సదస్సులో 33 జిల్లాల నుండి, హైదరాబాద్ నగరం, & సచివాలయ జాక్ కమిటీ భాద్యులు, అనేక అనుబంధ (206) సంఘ TGEJAC నేతలు భారీ సంఖ్యలో వేలాదిగా పాల్గొన్నారు.
TGEJAC announced maha dharna on June 9th 2025.
టీ జి ఈ జాక్ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు మాట్లాడుతూ…
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, అలసత్వం 13 లక్షల 31 వేల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని అన్నారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన సాచివేత, నిర్లక్ష విధానాల వల్ల తీవ్ర అశాంతికి లోనైనారు. ఈ అశాంతిని, నిరసనలతో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించింది. ఉద్యోగ కుటుంబాలలో చీకటి తొలగి ఉషోదయం వస్తుందని ఆశ పడ్డారు. అధికార మార్పిడి జరిగి 18 నెలలు అయ్యింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పదే పదే ప్రాతినిధ్యాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము. పరిష్కరిస్తామని కుదురుకోవడానికి సమయం కావాలని అడిగినప్పుడు సరే అన్నాము. వేచి చూసాము. ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించమని కోరాము. కానీ పరిష్కారము వైపు ప్రభుత్వము చిత్తశుద్ధి కనపర్చటం లేదు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడి (7) నెలలు అయ్యింది. కానీ ఒక్కసారి కూడా సమావేశం జరిపింది లేదు.
ప్రజాస్వామ్య భారత చరిత్రలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద సంఖ్యలో (5) కరువు భత్యాలను పెండింగ్ లో పెట్టలేదు. ఏకంగా (5) కరువు భత్యాలను ప్రకటించకుండా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇది రాష్ట్ర ప్రతిష్టకు ఇబ్బందికరం. టోకు, వినియోగదారుడి ధరల సూచిక ఆకాశాన్ని తాకుతున్నవి. వీటి ఆధారంగా సహజ న్యాయంగా ఉద్యోగులకు ఇచ్చే కరువుభత్యాలను వెంటనే విడుదల చేయాలి. మేము ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లలో మొదటి ప్రాధాన్యంగా పెట్టింది (10) వేల కోట్ల పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయడం. ఉద్యోగ కుటుంబాలు తమ కుటుంబ తక్షణ, దీర్ఘకాలిక అవసరాల కోసం ఆర్థిక క్రమశిక్షణతో పొదుపు చేసిన డబ్బులను అవసరమైనప్పుడు సకాలంలో ఇవ్వక పోవడం అమానవీయం. పిల్లల విద్యా, వివాహ, ఇంకా వైద్య, గృహ అవసరాలకు డబ్బులు అందక తీవ్ర మానసిక శారీరక ఇబ్బందులకు గురవుతున్నారు..
24-10-2024న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులతో జరిపిన సమావేశంలో 15 రోజుల లోగా, పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 10% కూడా క్లియర్ కాలేదు. డిప్యూటీ సిఎం గారు ఏప్రిల్ 2025 నుండి ప్రతి నెల 650 కోట్లు కేటాయించి 16 నెలల లోగా పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఏప్రిల్ నెల లో 650 కోట్లుకాదు కదా ఐదు కోట్లను కూడా కేటాయించలేదు. ఇలాంటి వరుస ఉల్లంఘనలతో ఉద్యోగులు నమ్మకం కోల్పోతున్నారు.
వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన శ్రీ శివ శంకర్ గారి కమిటీ గడువు పూర్తయ్యి ఏడాదిన్నర అవుతున్నది. ఆ నివేదికను ఇంతవరకు ప్రభుత్వం తెప్పించుకోలేదు. నివేదికను తెప్పించుకుని కరువు భత్యాలను కలుపుకుని 51% ఫిట్ మెంట్ తో వేతన సవరణను ప్రకటించాలి.
ఉద్యోగులు పెన్షన్ దారులు. ప్రభుత్వ సమాన సహకారంతో ఆరోగ్య పథకం అమలు చేయాలని కోరాము. గత ప్రభుత్వంలోనే ట్రస్ట్, విధి విధానాలు ఏర్పడ్డాయి. వీటిని స్వల్ప మార్పులతో అమలు చేయాలని కోరాము. ఈ దిశగా ఒక్క అడుగు కూడా ప్రభుత్వం వేయలేదు. ఆరోగ్య ఖర్చులతో ఆర్థికంగా చితికి పోతున్నారు. ఆర్థికంగా భారం కానీ అనేక సమస్యలను పరిష్కరించాలని కోరాము.
సకాలంలో డిపిసి (departmental promotions committee)లు ఏర్పాటు చేసి సకాలంలో పదోన్నతులను అందించాలని, బదిలీల కోసం నిర్దిష్ట కేలండర్ ను ఏర్పాటు చేసి ఏప్రిల్ మే నెలలో సాధారణ బదిలీలు నిర్వహించాలని కోరాము.
గౌరవ సి యం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో, ఫలితాలను సాధించడంలో, విజయోత్సవాల నిర్వహణలో ఉద్యోగులు నిబద్ధతతో పాల్గొన్నారు. అనేక సర్వేలు ఎక్కువ పని గంటల పాటు తెలంగాణ ఉద్యోగులు తమ విధులను నిర్వహిస్తున్నారని తెలిపాయి. వివిధ ప్రగతి సూచికలలో తెలంగాణ సాధించిన మెరుగైన స్థానాలు దీనికి నిదర్శనం. ఉద్యోగ వర్గం తెలంగాణ సమాజాన్ని తమ కుటుంబంలా భావిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.ప్రజల ఆకాంక్షలు సమస్యల పట్ల సకాలంలో స్పందించడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి చేస్తున్న కృషి చేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో స్పందించడం, సామాజిక భాద్యతతో కూడిన అపురూప సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. దీనిని గుర్తించాలని ప్రజా ప్రభుత్వం ఏ మాత్రం అలసత్వం లేకుండా ఉద్యోగుల మౌలిక సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలని కోరారు.
సదస్సులో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలు.
- యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలి.
- (1/1/23), (1/7/23), (1/1/24), (1/7/24), (1/1/25) డీఏలను 5 వెంటనే విడుదల చేయాలి.
- ఉద్యోగుల (EHS) ఆరోగ్యం రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలి.
- సి పి యస్ ను రద్దు చేయాలి.
- వేతన సవరణ కమిటీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51% ఫిట్ మెంట్ తో అమలు చేయాలి.
- స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి 317 జి ఓ ను అమలు చేయాలి.
- అన్ని ప్రభుత్వ శాఖలలో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి పదోన్నతులను ఇవ్వాలి.
- ఎన్నికల సమయంలో నిర్వహించిన బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి వారి పూర్వ స్థానాలకు చేర్చాలి.
- 2025 సంవత్సరానికి సాధారణ బదిలీలు మే / జూన్ లోనే చేయాలి.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు విఫలమవ్వడం కొనసాగితే ఇప్పటికే ప్రకటించిన కకార్యచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
15-05-2025 : జిల్లా మరియు రాష్ట్ర రాజధాని లో భోజన విరామ సమయములో నల్ల బ్యాడ్జిలతో నిరసన ప్రదర్శనలు. . Lunch hour demonstration with wearing black badges.
09-06-2025 : ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా (Mahadhrna & RALLY) సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ…
పైన తెలిపిన కార్యాచరణ తో పాటుగా
- పనివేలలో మాత్రమే పని చేయటం. (Work to Rule)
- మానవ హరాలూ – సాముహిక భోజనాలు. (ప్రభుత్వ కార్యాలయాల ముందు)
- రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ (Pen down)
- సామూహిక సెలవులు (Mass causal leaves)
లాంటి సంఘటిత విస్తృత విశాల ఉద్యమాన్ని నిర్మించడానికి వెనుకాడబోము అని, ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించవలసిన పరిస్థితి ప్రాథమిక సభ్యుల నుండి తీవ్రంగా వస్తున్నదని తెలియచేస్తున్నాము. తెలంగాణ సమాజం ఎల్లకాలం ఏ అణచివేతను, సాచివేతను, అగచాట్లను అవమానాన్ని భరించిన చరిత్ర లేదని అన్నారు.


- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్