10 లక్షలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు – నీతి ఆయోగ్

హైదరాబాద్ (నవంబర్ – 16) : నీతి అయోగ్ తాజా నివేదిక ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు 10 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని (10 Lakhs Teacher Posts Vacancy in India) తాజాగా విడుదల చేసిన ‘సాత్’ (సస్టెయినబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్ఫామింగ్ హ్యూమన్ కేపిటల్) నివేదిక తెలిపింది.

రాష్ట్రాల్లో 30 నుంచి 50% వరకు ఈ పోస్టులు ఖాళీగా ఉండటంపై ఆందోళన వ్యక్తంచేసింది. ఈ కొరతను నివారించడానికి అదనపు టీచర్ కేడర్ సృష్టించి పెద్దఎత్తున ఖాళీల భర్తీ చేపట్టాలని పేర్కొంది.

“దేశంలో టీచర్ల కొరత ఉంది. దీనికి తోడు ఉన్న టీచర్లను సమపద్ధతిలో పంపిణీ చేయలేదు. పట్టణ ప్రాంతాల్లో అత్యధిక టీచర్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇంత భారీ ఖాళీలతో ఉన్నత ఫలితాలు సాధించలేం. ఈ సమస్యను పరిష్కరించడం అంత సులభమేమీ కాదు. ఇది రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. దాన్ని భరించే శక్తి రాష్ట్రాలకు లేదు. దీనికి తోడు నియామక ప్రక్రియలో సంక్లిష్టత, న్యాయపరమైన సవాళ్లు, ఖాళీల భర్తీకి అడ్డంకిగా ఉన్నాయి. ప్రభుత్వ టీచర్లకు చెల్లించే ప్రైవేటు రంగంలో అత్యుత్తమ టీచర్లకు చెల్లించే వేతనాల కంటే రెండురెట్లు అధికంగా ఉంటున్నాయి. అందువల్ల ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలి. పట్టణప్రాంతాల్లో అధికంగా ఉన్న ఉపాధ్యాయుల్ని గ్రామీణ ప్రాంతాలకు పంపాలి. అవసరమైన ప్రోత్సాహకాలు అందించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2-5 లక్షలమంమందికి సరైన శిక్షణ లేదు. దానివల్ల విద్యాహక్కు చట్టం లక్ష్యాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు” అని ఈ నివేదిక వెల్లడించింది.