తెలుగు భాషకు గొడుగు : గిడుగు (ఆగష్టు 29 తెలుగు భాషా దినోత్సవం)

  • అడ్డగూడి ఉమాదేవి ప్రత్యేక వ్యాసం

తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు,వ్యవహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషావేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, శాసన పరిశోధకుడు, తెలుగుభాషకు గొడుగు గిడుగు రామమూర్తి (ఆగష్టు 29,1863_జనవరి 22,1940) శ్రీకాకులం జిల్లా పర్వతాలపేటలో జన్మించారు. 1880లో పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడిగా జీవితం మొదలు పెట్టి 1911 వరకు విద్యాభివృద్ధికై కృషి చేసాడు. భారతదేశ విద్యావిధానంలో భాషల గురించి బ్రిటీషు ప్రభుత్వం అనేక చర్చలు జరుపగా 1899నుండి 1905 వరకు భారతదేశంలో వైస్రాయిగా పనిచేసిన లార్డ్ కర్జన్ విద్యకు సంబంధించి ఎన్నో సంస్కరణలు చేయగా ఆ నేపథ్యంలో తెలుగు భాషకై ఎంతో శ్రమించిన గిడుగు “స్వభాష స్వగృహం” వంటిదని వ్యవహారిక భాష గొప్పదనాన్ని తెలియజేసారు. వ్యవహారిక భాషకు పుస్తక భాషకు గల తేడా వల్ల విద్యావిధానానికి జరిగే అన్యాయం అతనిని వేధించగా భాషా శాస్త్రంలోనూ, ధ్వని శాస్త్రంలోనూ ఆయన చేసిన కృషికి గొప్ప భాషావేత్తయనీ, కాలంకన్నా ముందున్న భాషావేత్తయని అంతర్జాతీయ లింగ్విస్టుల ప్రశంసలందుకున్నారు.

1906లో విశాఖపట్టణానికి పర్యవేక్షణాధికారిగా వచ్చిన యేట్స్ ఆలోచనలు గిడుగుని శిష్ట వ్యవహారికం వైపు నడిపాయి. అప్పటిదాకా పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ కృతక గ్రాంథికంలో ఉండగా వాటి స్థానంలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాలని గిడుగు వాదించారు. గురజాడ, గిడుగు, శ్రీనావాస అయ్యంగారు, యేట్సు దొరల కృషి వ్యవహారిక భాషోద్యమానికి పురుడుపోసింది. ప్రధాన గిరిజన ప్రాంతమైన పర్లాకిమిడి సవరల స్థితిగతులను చూసి వారి అభ్యున్నతికై 1892లో గిడుగు సవర భాష నేర్చుకొని వారికై ఒక పాఠశాలను తెరిచి విద్యాభివృద్ధికై 1894లో ఒక మెమొరాండంను నాటి మద్రాసు గవర్నర్ కు నివేదించగా 1913 నాడు మద్రాసు ప్రభుత్వం వారు “రావు బహుదూర్ ” బిరుదునిచ్చారు.

1906 నుండి 1940 వరకు తెలుగుభాషకై కృషిచేసిన గిడుగు ప్రామాణికమైన భాష జీవరహితమైనదని నిరూపిస్తూ “బాలకవి శరణ్యం” “ఆంధ్ర పండితు భిషక్కుల భాషా భేషజము” “గద్యచింతామణి” వంటి రచనలు చేసి వాటి ఆధారంగా 1912లో “A Memorandum of Modern Telugu” ను ప్రభుత్వానికందించారు. 1919- 20 మధ్య వ్యవహారిక భాషోధ్యమ ప్రచారం కొరకు “తెలుగు” అనే మాసపత్రిక ప్రారంభించి శాస్త్రీయ వ్యాసాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించగా ఆ పత్రిక ఒక యేడాది మాత్రమే నడిచినా చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావఝుల శివశంకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి వంటివారు వ్యవహారిక భాషకే ప్రాధాన్యతనిచ్చారు. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన “ఆధ్ర సాహిత్య పరిషత్తు “ఏర్పడగా వావిలికొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషకు ప్రాధాన్యత నిచ్చి ఉద్యమం చేసారు. 1925 తణుకులో ఆంధ్ర సాహిత్య పరిషత్తులో వ్యవహారిక భాష గురించి అనర్గళంగా ప్రసంగించగా సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు గిడుగు వాదాన్ని బలపరిచాయి. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి అధ్యక్షతన గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించగా 1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవాన్ని ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో గొప్పగా జరిపారు. 1924 లో ఆంధ్రసాహిత్య పరిషత్తు అధికారికంగా నిషేధాన్ని ఎత్తి వేయగా 1936లో శిష్టవ్యవహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” పత్రిక ప్రచురించగా,1937లో తాపి ధర్మారావు సంపాదకత్వంలో “జనవాణి” పత్రిక వాడుక భాషలో వార్తలకు సంపాదకుయాలకు శ్రీకారం చుట్టింది.

గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని రచనలని కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవవల్ల తెలుగు అకాడమీ 2014 – 2016 లో రెండు పెద్ద సంపుటాలు వెలువరించింది .గిడుగు శిష్యురాలు మిస్ మంట్రో “భారతదేశంలోని ఉదాత్తతకీ, సౌందర్యానికీ సంపూర్ణ ప్రతినిధి గిడుగు” అని చాటిచెప్పగా 1934లో ప్రభుత్వం” కైజర్ ఎ హింద్ ” బిరుదుతో 1913లో “రావు సాహెబ్” 1938లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు”- కళాప్రపూర్ణ”తో గౌరవించింది.

గ్రాంథిక భాష గ్రంథాలలో కనబడేదే కానీ వినబడేది కాదు అని “విజ్ఞాన సముపార్జనకు వ్యవహారిక భాషే ఉత్తమం” అంటూ “జీవద్భాషకు నియమకారుడు రచయితే కాని, లాక్షణికుడు, వ్యాకరణకర్త కాడన్న గిడుగు మాటలు అక్షరసత్యం కాగా గిడుగు రామమూర్తి జన్మదినాన్ని “తెలుగు భాషా దినోత్సవంగా ” జరుపుకోవడం ఆనందదాయకం.

వ్యాసకర్త :
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు
9908057980

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @