హైదరాబాద్ (ఫిబ్రవరి – 07) : వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 46 శాతం మందికి ఉపాధి తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఏటేటా పెరుగుతున్నాయని రాష్ట్ర గణాంకాల తాజా నివేదిక వెల్లడించింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వనరులు, ఉపాధి, ఇతర అంశాలపై అధ్యయన వివరాలను తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే – 2022 నివేదికలో వెల్లడించారు.
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 65 లక్షల మంది వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమేపీ పెరిగి.. 2021-22 నాటికి 1.5 కోట్లకు చేరింది. వీరిలో అత్యధికంగా 46 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు.తర్వాతి స్థానంలో పారిశ్రామిక రంగం ఉంది. ఔషధ, ఇంధన, రసాయన, జౌళి, తయారీ పరిశ్రమల్లో 11 శాతం.. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, ఆతిథ్యం, ఇతర వాణిజ్య, సేవా రంగాల్లో 11 శాతం మంది ఉన్నారు. నిర్మాణ, రవాణా రంగాల్లో 9 శాతం మంది చొప్పున పనిచేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
◆ జీఎస్‌డీపీ లో రంగాల వారీగా వాటాలు (శాతాల్లో)
- వ్యవసాయం, అనుబంధ రంగాలు: 21
- స్థిరాస్తి, ఐటీ, ఇతర వృత్తి రంగాలు: 21
- తయారీ: 12;
- రవాణా: 9;
- ఆర్థిక సేవలు: 9;
- వాణిజ్యం: 9;
- నిర్మాణ: 4;
- ఇతరాలు: 15