హైదరాబాద్ (ఎప్రిల్ – 15) : ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాతపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(TSPLRB) విడుదల చేసింది. ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన అర్ధమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ, ఆంగ్లభాష, జనరల్ స్టడీస్, తెలుగు లేదా ఉర్దూభాషకు సంబంధించిన సబ్జెక్టు పరీక్షల కీని మండలి వెబ్సైట్ లో శనివారం ఉదయం 8 గంటల నుంచి 17న సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు.
అభ్యంతరాలుంటే ప్రతీ ప్రశ్నకు ప్రత్యేక ప్రొఫార్మాలో ఆన్లైన్లోనే నమోదు చేయాలని మండలి చైర్మన్ వి. వి. శ్రీనివాసరావు సూచించారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను తుది కీ సమయంలో వ్యక్తిగత లాగిన్లలో అందుబాటులో ఉంచుతామన్నారు. మిగిలిన పరీక్షల ప్రాధమిక కీ నీ త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుచుతామని చెప్పారు.