PHARMA SEATS COUNSELING : ఎంపీసీ, బైపీసీ ఎంసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్ (ఆగస్టు – 04) : ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా- డి కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. సాధారణంగా ఏటా ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్ అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు. ఈ నెల 11వ తేదీతో చివరి విడత ప్రక్రియ పూర్తవుతుంది.

17వ తేదీ నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ మొదలవుతుంది. అందులో బీఫార్మసీ, ఫార్మా డి సీట్లలో 50 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. రాష్ట్రంలో సుమారు
13 వేల ఫార్మసీ సీట్లు (కన్వీనర్, యాజమాన్య కోటా) అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో ఫార్మా కోర్సులో ఎంపీసీ విద్యార్థులు చేరాలంటే ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.

◆ సెప్టెంబర్ లో బైపీసీ ఎంసెట్ కౌన్సెలింగ్

ఫార్మసీ కోర్సుల్లో చేరే బైపీసీ విద్యార్థులకు సెప్టెంబరు మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీసీ విద్యార్థులు చేరిన తర్వాత మిగిలిన సీట్లన్నింటికీ కలిపి కౌన్సెలింగ్ జరుపుతారు.

◆ చివరి విడతలోనే ఎన్సీసీ, క్రీడా కోటా సీట్లు

ఎంసెట్ చివరి విడతలో ఎన్సీసీ, క్రీడా తదితర ప్రత్యేక కోటా కింద బీటెక్ సీట్లను కేటాయించనున్నారు. సుమారు 1,050 మంది ఎన్సీసీ, 80 మంది
క్రీడా విభాగం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆయా విభాగాల అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి ఎంసెట్ ప్రవేశాల కమిటీకి ఇప్పటికే అందజేశారు.
వారందరూ చివరి విడతలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఈ నెల 9వ తేదీన సీట్లు కేటాయిస్తారు.